కేసీఆర్- జగన్ ఒక్కటే.. తెలంగాణలోనూ న్యాయం జరగదు : వివేకా కేసు బదిలీపై ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 30, 2022, 5:02 PM IST
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయడంపై మాజీ మంత్రి , బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, జగన్ ఒక్కటేనని.. అందువల్ల తెలంగాణలోనూ న్యాయం జరగదని ఆయన వ్యాఖ్యానించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో విచారణ సరిగ్గా జరగదంటూ వివేకా కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. తాజాగా వివేకా హత్య కేసుపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యుల ప్రమేయం వున్నందునే ఏపీలో విచారణ సరిగా జరగడం లేదని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. 

కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేం లేదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలోనూ విచారణ పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆదినారాయణ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్, జగన్ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. వివేకా హత్య కేసుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని ఆదినారాయణ రెడ్డి గుర్తుచేశారు. వివేకాను గుండెల్లో పొడిచి, గుండెపోటుగా కథ అల్లారని, ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసి రాజకీయాలను వదిలేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని జగన్‌కు రెండోసారి అధికారం అందించాలని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. 

ALso REad:వైఎస్ వివేకా హత్య కేసు‌ విచారణ తెలంగాణకు బదిలీ.. దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..

కాగా.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ‌కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు మంగళవారం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ స్పెషల్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా తెలిపింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఏపీలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదని సునీతా రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించింది. 

కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌ స్పెషల్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సంబంధిత పత్రాలు, ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడతాయి. భారీ కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా చేయాలని స్పష్టం చేసింది. 

మరణించిన వ్యక్తి కూతురు, భార్యకు విచారణపై  అసంతృప్తి ఉన్నందున బదిలీ చేస్తున్నట్టుగా పేర్కొంది. వారికి బాధితులుగా ప్రాథమిక హక్కు పొందే హక్కు ఉంటుందని తెలిపింది. న్యాయం జరగుతుందని మాత్రమే కాదు.. అది జరిగేలా చూడటం కూడా ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. సు విచారణ సమయంలో పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాల్సి ఉంటుందని.. ఆ సాక్షులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని అభిప్రాయపడినట్టుగా ధర్మాసనం తెలిపింది. 
 

click me!