
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అత్యంత కేసులు నమోదైన కుటుంబం ఏదైనా ఉందంటే అది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబమే అని చెప్పాలి.
కే ట్యాక్స్ పేరుతో మామూళ్లు వసూళ్లు చేశారంటూ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణతోపాటు ఆయన కుమార్తె విజయలక్ష్మిపై కూడా పలువురు ఫిర్యాదు చేశారు. కోడెల శివప్రసాదరావుకు కుమార్తె విజయలక్ష్మి తనను మోసం చేసిందంటూ నరసరావుపేటకు చెందిన బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బుజ్జి వెంకాయమ్మ ఫిర్యాదుతో కోడెల తనయ విజయలక్ష్మిపై చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ విజయలక్ష్మీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. హైకోర్టులో పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో తనను రెండో నిందితురాలిగా పేర్కొన్నారన్నారని ఆమె చెప్పారు.
బుజ్జి వెంకాయమ్మ కు సంబంధం లేకపోయినా సివిల్ వివాదంలో కేసు నమోదు చేశారని ఆరోపించారు. 2014లో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. తక్షణమే కేసును కొట్టివేయాలంటూ కోరారు.