జగన్ వెంటే మా కుటుంబం .. పార్టీ మార్పుపై తేల్చేసిన మేకతోటి సుచరిత భర్త

Siva Kodati |  
Published : Jan 06, 2023, 07:33 PM IST
జగన్ వెంటే మా కుటుంబం .. పార్టీ మార్పుపై తేల్చేసిన మేకతోటి సుచరిత భర్త

సారాంశం

పార్టీ మార్పు వార్తలకు చెక్ పెట్టారు  ఏపీ మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త దయాసాగర్. తాము జగన్ వెంటే వుంటామని.. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని ఆయన కోరారు. రిటైర్ అయిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని దయాసాగర్ అన్నారు.   

తమ కుటుంబం వైసీపీని వీడుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఏపీ మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త దయాసాగర్. తాను రాజకీయాల్లోకి వస్తే అందరికీ చెప్పే వస్తానని ఆయన తెలిపారు. నిరాధారమైన ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం లేదని దయాసాగర్ పేర్కొన్నారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అత్యంత అనుబంధం వుందన్నారు. తమ కుటుంబం పార్టీ మారే అవకాశం లేదని దయాసాగర్ కొట్టిపారేశారు. తాను అక్కడి నుంచి పోటీ చేస్తాను, ఇక్కడి నుంచి పోటీ చేస్తానంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోందని దయాసాగర్ మండిపడ్డారు. రిటైర్ అయిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని ఆయన కోరారు. 

ఇదిలావుండగా.. తన భర్త పార్టీ మారితే  తాను కూడా  మారుతానని మాజీ మంత్రి  మేకతోటి సుచరిత  సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. బుధవారంనాడు  గుంటూరు జిల్లా  కాకునూరులో  జరిగిన  కార్యక్రమంలో  ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  నా భర్త ఓ పార్టీలో, తాను  ఓ పార్టీలో తమ పిల్లలు వేరో పార్టీలో  ఉండొద్దని తమ అభిమతమన్నారు.దయాసాగర్ పార్టీ మారుతాను..నువ్వు నాతో రా అంటే తాను  ఎంత రాజకీయ నాయకురాలినైనా  భార్యగా  తాను భర్త అడుగు జాడల్లో నడుస్తానని  ఆమె వివరించారు.ఒకే కుటుంబంలో ఉన్న వారిలో కూడా అభిప్రాయబేధాలు సహజమన్నారు. అంత మాత్రాన వారంతా వేరు కాదని సుచరిత స్పష్టం చేశారు. తమ రాజకీయ జీవితం వైసీపీతోనే ముడిపడి ఉందని  సుచరిత వ్యాఖ్యానించారు.రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు  జగన్ తో కలిసి ఉండాలన్నదే తమ అభిమతంగా  సుచరిత పేర్కొన్నారు. 

ALso REad: నా భర్త పార్టీ మారితే ఆయన అడుగు జాడల్లోనే: మాజీ మంత్రి మేకతోటి సుచరిత

కాగా.. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేకతోటి సుచరితకు కీలకమైన హోం శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్.అయితే మంత్రివర్గ విస్తరణలో ఆమె కేబినెట్ బెర్త్ కోల్పోయారు.ఎస్సీ సామాజిక వర్గం నుంచి పలువురిని కొనసాగించి.. తనను మాత్రం కేబినెట్ నుంచి తొలగించడంపై మేకతోటి సుచరిత అసంతృప్తికి లోననైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారనే ప్రచారం కూడా సాగింది. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. 

చివరకు వైఎస్ జగన్‌తో భేటీ అయిన తర్వాత మేకతోటి సుచరిత కాస్తా చల్లబడ్డారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సుచరితను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్