
ఈ మధ్య చంద్రబాబు ఏ విషయంలో కూడా ప్రపంచ స్ధాయికి తగ్గటం లేదు. తాను తలపెట్టిన ఏ కార్యక్రమమైనా ప్రపంచస్ధాయిలో ఉండేట్లు చూసుకోవటమో లేక ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలనో అనుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
సిఎం కాగానే విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుఫాను తుడిచి పట్టేసింది. వారం రోజుల్లోనే ప్రజల జీవన స్ధితిగతులను మామూలు స్ధాయికి తెచ్చేసానని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ప్రపంచదేశాల్లో ఎక్కడా జరగని విధంగా తాను హుద్ హుద్ తుఫానుపై గెలిచానని ప్రకటించుకున్నారు.
ఇటీవలే రాయలసీమను పట్టి కుదిపేసిన కరువుపైన కూడా యుద్ధం ప్రకటించి విజయం సాధించానని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇప్పటి వరకూ వాడని విధంగా వాటర్ గన్స్ ను ఉపయోగించి కరువుపై గెలిచనన్నారు. అలాగే, దోమలపైన కూడా ప్రపంచంలోనే మొదటిసారి యుద్ధం ప్రకటించి గెలిచామని చెప్పారు.
ఇక, రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అయితే అంతే లేదు. ప్రతిదీ ప్రపంచ స్ధాయే. కాకపోతే అక్కడ శంకుస్ధాపన జరగటం తప్ప ఇంత వరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదు. అమరవాతి ప్రాంతంలో నిర్మితమయ్యే విద్యాసంస్దలు, ఆసుపత్రులు, కన్వెన్షన్ సెంటర్లు ప్రతిదీ ప్రపంచస్ధాయే.
ప్రస్తుతానికి వస్తే వార్దా తుఫాను అంచనా సమాచారాన్ని మొత్తం సిఎం డ్వాష్ బోర్డులో అప్ లోడ్ చేయాలని, వార్ధా డేటాని భద్రపరచాలని చెప్పారు. తుఫాను విషయంలో ‘మనం తీసుకుంటున్న అప్రమత్త చర్యలు, సహాయ చర్యలు ప్రపంచానికే ఓ నమూనాగా నిలవాల’ని అధికారులను ఆదేశించటం గమనార్హం.