మన్యంలో మళ్లీ తుపాకుల మోత: పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు

By Siva KodatiFirst Published Sep 23, 2019, 8:13 PM IST
Highlights

విశాఖ మన్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో నిన్న ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ మావోయిస్టుల కోసం గాలిస్తుండగా పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి

విశాఖ మన్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో నిన్న ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ మావోయిస్టుల కోసం గాలిస్తుండగా పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి.

నిన్న ఎన్‌కౌంటర్‌లో సుమారు 17 మంది వరకు మావోయిస్టులు గాయపడ్డారని చింతపల్లి పోలీసులు తెలిపారు. వీరందరినీ ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటీవల ఏవోబీకి వచ్చిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు.

ఈ నెల 21 నుంచి 28 వరకు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాలు జరుగుతుండటంతో ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు ఆదివారం మాదిగమల్లులో కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో గుమ్మిరేవులలో మావోలు ఉన్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఇరువర్గాలకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినవారిలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గత కొంతకాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగితస్తున్నారు.

ఏడాది క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్యకు అరుణే పథకం రచించినట్లు పోలీసులు నిర్థారించారు. గతంలో ఆమె పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. 
 

విశాఖలో ఎన్‌కౌంటర్: మావో అగ్రనాయకురాలు అరుణ హతం

click me!