
ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి తనదైన శైలిలో జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణతో పాటే శాసనసభను ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో శాసనసభను రద్దు చేయాలని…తద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలిపారు. అలా చేయడం వల్ల డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు ఖాయమని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ…
‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆలోచిస్తున్నాయి. వారు పొత్తులు పెట్టుకుని ఏకం కావడానికి అంటే ముందే ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రతిపక్షాలు ఈ సారి ఎన్నికలకోసం కలవడం ఖాయం. కేంద్రంలొ అధికారంలో ఉన్న పార్టీ కూడా వారితో చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.. వైసిపి పార్టీ ఘనవిజయానికి గత ఎన్నికల్లో కోడి కత్తి కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కారణం. అవి మా పార్టీ పెద్దలు ఆడించిన నాటకమేనని ఇప్పుడు తేలితే.. మా పార్టీ పరిస్థితి రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో నాకు అంత చిక్కడం లేదు.
కోడికత్తి కేసు : జగన్ కు ప్రాణహాని జరగకూడదు, సానుభూతి రావాలి... అందుకే భుజంపై దాడి చేశా..
కోడి కత్తి కేసు ఓ నాటకమని ఇప్పటికే ఎన్ఐఏ తేల్చింది. వివేకా హత్య కేసు కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఈ హత్య కేసులో ఈ నేలాఖరులోగా చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కేసులో అనుమానితులను అరెస్టు చేస్తామని కూడా హైకోర్టుకు సిబిఐ తెలిపింది. అని రఘురామా చెప్పుకొచ్చారు. కోడి కత్తి దాడి తర్వాత జగన్ ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయించుకోలేదు. అలాగే విమానంలో హైదరాబాదుకు వెళ్లారు. అక్కడ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స చేయించుకున్నట్లుగా యాక్షన్ చేశారు.
అలాంటి గాయమైనప్పుడు ఎవరు కూడా న్యూరో సెంటర్ కు వెళ్ళరని.. చికిత్స కోసం ట్రామా సెంటర్ కు వెళ్తారని’ విమర్శించారు. చిన్న గాయానికి పెద్ద గాయం అన్నట్టుగా పెద్ద కట్టు కట్టారని ఎద్దేవా చేశారు. గన్నవరం సీఐ కి ఈ మధ్యకాలంలో దెబ్బ తగలకపోయినా తగిలినట్టుగా కట్టు కట్టినట్లే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ సమయంలో డాక్టర్ సాంబశివారెడ్డి అలాగే కట్టు కట్టారని అన్నారు. దీనివల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. సాంబశివారెడ్డికి కీలకమైన మెడికల్ కౌన్సిల్ చైర్మన్, ఆరోగ్యశ్రీ వైస్ చైర్మన్ కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు.