అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఇవాళ విచారణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులతో అవినాష్ కుమార్ సమీక్షించారు..
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం నాడు విచారణ నిర్వహించారు. ఇవాళ ఉదయం కలెక్టరేట్ లోని అధికారులతో అవినాష్ కుమార్ ఈ విషయమై సమీక్షించారు. 2019 ఎన్నికల తర్వాతి నుండి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరువేల ఓట్లను తొలగించే కుట్ర జరిగిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంలో తొలగించిన ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయన అందించారు.
విడపనకల్లు మండలం చీకలగురి గ్రామానికి చెందిన 47, 48 పోలింగ్ బూత్ లలో గత ఏడాది డిసెంబర్ మాసంలో 13 ఓట్లు తొలగించారని పయ్యావుల కేశవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కానీ ఈ పోలింగ్ బూత్ లలో ఎలాంటి ఓట్లను తొలగించలేదని పయ్యావుల కేశవ్ కు జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విచారణకు వస్తారని తెలుసుకున్న జిల్లా యంత్రాంగం చీకలగురి లో ఓట్ల తొలగింపుపై ఇద్దరిని బాధ్యులుగా చేస్తూ నిన్న సస్పెండ్ చేశారు. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి కేశవ్ అవినాష్ కుమార్ కు వివరాలు అందించారు.
undefined
అనంతపురం జిల్లా కలెక్టర్ సహ ఇతర అధికారులతో సమావేశమైన తర్వాత చీకలగురికి అవినాష్ కుమార్ వెళ్లారు. ఓట్ల తొలగింపు అంశంపై అవినాష్ కుమార్ ఈ గ్రామంలో విచారణ నిర్వహించనున్నారు.. తన నియోజకవర్గంలో ఆరువేల ఓట్లను తొలగించే కుట్ర చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కనీస సమాచారం లేకుండా ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఓట్లు తొలగిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయమై హడావుడిగా ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే కేశవ్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని కేశవ్ చెప్పారు.
చీకలగురిలో ఏం జరిగిందంటే
చీకలగురిలోని 57, 48 పోలింగ్ బూత్ లలో 13 ఓట్లు తొలగించిన విషయమై ఈసీకి పయ్యావుల కేశవ్ గత ఏడాది అక్టోబర్ మాసంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారి గత ఏడాది నవంబర్ 3న ఆదేశించింది. అదే నెల 12న విడపనకల్లు తహసీల్దార్ ఈ విషయమై విచారణ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించారు నవంబర్ 21న జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. తహసీల్దార్ ఇచ్చిన నివేదికలో తప్పులున్నాయని పయ్యావుల కేశవ్ ఈసీకి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గుంతకల్లు ఆర్డీఓతో గత ఏడాది డిసెంబర్ 29న విచారణ నిర్వహించి నివేదికను రూపొందించారు.