ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి జూలై 6న పోలింగ్: షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

By narsimha lodeFirst Published Jun 15, 2020, 2:47 PM IST
Highlights

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది జూలై 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ను ప్రకటించింది.

అమరావతి:డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది జూలై 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ను ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 9వ తేదీన డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటా కింద డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీగా అప్పట్లో చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారు.

ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో పాటు గుంటూరు జిల్లా టీడీపీలో చోటు చేసుకొన్న స్థానిక సమస్యల కారణంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపికి గుడ్‌బై చెప్పారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి కూడ రాజీనామా చేశారు.

2023 మార్చి 29వ తేదీ వరకు ఈ ఎమ్మెల్సీ పదవి కాలం ఉంటుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి షెడ్యూల్ ను ఈసీ ఇవాళ విడుదల చేసింది.

ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటీఫికేషన్ విడుదలకానుంది.  నామినేషన్ల దాఖలు చేయడానికి ఈ నెల 25 చివరి తేది. నామినేషన్ల స్క్యూట్నీని ఈ నెల 26న నిర్వహించనున్నారు.

ఈ నెల 29వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకొనేందుకు చివరి తేదిగా నిర్ణయించారు. ఈ ఏడాది జూలై 6వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.   అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఓట్లను లెక్కించనున్నారు. జూలై 8వ  తేదీలోపుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది.

click me!