
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఈసీ తీపి కబురు చెప్పింది. ఏపీ కేబినెట్ సమావేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఈసీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది.
మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయే కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం నాలుగు ముఖ్యశాఖల అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ ఎజెండాలో పొందుపరచాల్సిన అంశాలపై మాత్రమే సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అంతేకానీ చెల్లింపుల వ్యవహారంపై , పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పష్టం చేసింది.
ఇకపోతే కేబినెట్ భేటీలో ప్రస్తావించిన అంశాలపై సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో సమీక్షనిర్వహించనున్నారు. తాగునీరు, సాగునీరు, కరువు, ఫొని తుఫాన్ నష్టం, ఉపాధి హామీ పథకం అమలు వంటి అంశాలపై కేబినెట్ భేటీలో ప్రస్తావించనున్నారు చంద్రబాబు.
ఏపీ కేబినెట్ మీటింగ్ నిర్వహణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. తాను కేబినెట్ మీటింగ్ నిర్వహించి తీరుతానని ఏ అధికారి హాజరుకారో చూస్తానంటూ చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
అయితే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ కేబినెట్ నిర్వహణకు సంబంధించి కేబినెట్ అజెండాలను పంపాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు కేబినెట్ అజెండాలోని నాలుగు అంశాలను పొందుపరుస్తూ అజెండా నోట్ ను అందజేశారు.
అజెండాపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. అజెండాలోని నాలుగు అంశాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమావేశమైన సీఎస్ అనంతరం నివేదికను ఈసీకి అందజేశారు. ఈసీ గోపాలకృష్ణ ద్వివేది కేబినెట్ అజెండాను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పెండింగ్ బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని హెచ్చరించింది. ఏపీ కేబినెట్ భేటీకి సిఈసీ అనుమతులు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది.
చంద్రబాబు నాయుడు పంతం నెగ్గిందని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు కేబినెట్ పెట్టాలని నిర్ణయిస్తే దాన్ని అడ్డుకోవాలని చూశారని కానీ ధర్మమే గెలిచిందంటూ టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.