
న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఖాయం అని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో ఈ విషయాన్నే మాట్లాడారని తెలిపారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందని వివరించారు. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేసి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీతో సమావేశం అయ్యారని గుర్తు చేసిన ఆర్ఆర్ఆర్.. సీఎం జగన్ ఎన్డీయేలో చేరడానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే, ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు. తెలంగాణతోపాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలూ నిర్వహించాలని చేసిన జగన్ విజ్ఞప్తికి ఢిల్లీ పెద్దలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తనకు తెలిసిందని రఘురామ చెప్పారు.
తెలంగాణ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఇప్పుడు ఏపీ కూడా ముందస్తుకు వెళ్లితే.. తెలంగాణతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి.
Also Read: ఢిల్లీ పెద్దలతో బండి సంజయ్ చర్చలు.. రఘునందన్‌రావు పై యాక్షన్?
ఏపీలో ముందస్తు విషయమై ప్రతిపక్షాలను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నదని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అందుకే ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు వాదనలను ఖండించారు. మీడియాకు వాళ్లే లీకులు ఇచ్చారని, మళ్లీ వాటిని నమ్మరాదని వాళ్లే చెబుతున్నారని వివరించారు. తద్వార ప్రతిపక్షాలు డైలమాలో పడుతాయని, ఎన్నికలకు సీరియస్‌గా సిద్ధం కావని పేర్కొన్నారు.
సాధారణంగా జగన్ ఏవీ నిజాలు చెప్పరని, ఆయన అవాస్తవం అని చెప్పారంటే అది వాస్తవం అన్నట్టే అని తెలిపారు. ముందస్తు ఎన్నికలు లేవని చెప్పారంటే అవి కచ్చితంగా ఉన్నట్టుగానే భావించాలని చెప్పారు. కాబట్టి, ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయానికి సంబంధించి ఇంకొంత సమాచారం బయటకు వస్తుందని వివరించారు.