
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎవరిని ఉద్దరించడానికి పెట్టాడని ప్రశ్నించారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తనపై చేసిన విమర్శలు, ఆరోపణలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్పవరం సెంటర్‌లో మీటింగ్ పెట్టారని.. అది తన నియోజకవర్గం పరిధిలోకి రాదని అన్నారు. పవన్ ప్రసంగంలో ఎక్కువ భాగం తన గురించే మాట్లాడారని అన్నారు.
పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా పవన్‌తో లేరని అన్నారు. రాజా రవితేజ అనే వ్యక్తి జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి పవన్‌పైన విమర్శలు చేశారని చెప్పారు. కానీ చాలా ఏళ్లుగా తనతో ఉన్నవాళ్లు ఇప్పటికీ తనతోనే ఉన్నారని తెలిపారు. తాను మూడు సార్లు పోటీ చేస్తే.. రెండు సార్లు గెలిచానని అన్నారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. తనను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. పొలిటికల్‌గా పవన్ జీరో అని విమర్శించారు.
Also Read: నీ పతనం ప్రారంభం : ద్వారంపూడి .. నీ సామ్రాజ్యం కూలుస్తా , లేదంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు
కాకినాడలో తనన ఓడించడం పవన్ వల్ల కాదని అన్నారు. తాను ఎవరి జోలికి వెళ్లనని.. తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనని చెప్పారు. తాను ఏ రోజు అవమానాలు ఎదుర్కొలేదని అన్నారు. పవన్‌కు పరిటాల రవి గుండె కొట్టించారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని అతని కుటుంబంలోని కూతురు వరుసయ్యే అమ్మాయి ఫిర్యాదు చేసిందని అన్నారు.
‘‘పవన్ కల్యాణ్ తాను సీఎం కాలేనని మార్చిలో మాట్లాడాడు. మార్చి 14న ఒక మాట మాట్లాడిన పవన్ కల్యాణ్.. జూన్ 14న మరో మాట మాట్లాడుతున్నాడు. ప్యాకేజీ కుదరకే వారాహి ఎక్కి ప్రజల్లో తిరుగుతున్నాడు’’ అని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ కన్నా తనది పెద్ద నాలుక అని.. ఆయన కంటే గట్టిగా విమర్శించగలనని అన్నారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలనే కోరిక ఒక్క సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వాస్తవంగా పవన్ సీఎం కావడం సాధ్యం కాదని అన్నారు. తాను రౌడీ, కబ్జాకోరు అయితే ప్రజలు తనను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.
తాను కాకినాడలో పవన్ కల్యాణ్ బ్యానర్ కట్టనివ్వకూడదని అనకుంటే.. అస్సలు జనసేన బ్యానరే ఉండేది కాదని అన్నారు. తన కుటుంబం దొంగనోట్ల ముద్రించినట్టుగా నిరూపించాలని సవాలు విసిరారు. ఎవడో చెప్పిన మాటలు విని పవన్ కోతి గంతులు వేయడం మానుకోవాలని అన్నారు. తన దగ్గర రూ. 15 వేల కోట్లు ఉంటే.. తానే పవన్‌కు ప్యాకేజ్ ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు.
కులాల ప్రస్తావన లేకుండా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉండదని ద్వారంపూడి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఏపీ నుంచి తరిమిస్తే.. అన్ని కులాలు కలిసి ఉంటాయని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని విమర్శించారు. పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవన్ ఇష్టమెచ్చినట్టుగా మాట్లాడితే.. తాము చేతల్లో చూపిస్తామని అన్నారు. పవన్ తన అన్న పేరు చెప్పుకొని వచ్చాడని.. కానీ తాము మెట్టు, మెట్టు ఎక్కి పైకి వచ్చామని చెప్పారు. పవన్ గురించి పూనమ్ కౌర్, రేణు దేశాయ్ మాట్లాడుతున్నారని.. అవసరమైతే తాము పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతామని అన్నారు.
పవన్ కల్యాణ్ చాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. జనసేన పార్టీ నుంచి తనపై పోటీ చేస్తే తుక్కు తుక్కుగా ఓడించకపోతే తన పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినే కాదని అన్నారు. పవన్ ఓడిపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని.. తాను ఓడిపోతే తాను తప్పుకుంటానని సవాలు విసిరారు. వేరే వాళ్లు పోటీకి వస్తే పవన్ కల్యాణ్‌ను పిరికివాడిగా భావించాల్సి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు ప్యాకేజ్‌కు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని విమర్శించారు .చంద్రబాబు అనుమతి లేనిదే ఆయన పార్టీ నేతలకు ఎక్కడ టికెట్ ఇస్తాడో కూడా చెప్పలేని దుస్థితి పవన్ కల్యాణ్‌ది అని విమర్శించారు. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆయన బాస్ చంద్రబాబును అడగాల్సిందేనని విమర్వించారు. పవన్ జనసేన అధినేత అయితే కాకినాడ వెళ్లేలోపు తన చాలెంజ్‌ను స్వీకరించాలని అన్నారు.
రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానని.. ఈరోజు నుంచి పవన్ పతనం ప్రారంభమైందని చెప్పారు. పవన్ కల్యాణ్ వెనక తాగుబోతు కుక్కలు ఉన్నారని విమర్శించారు. తన ఇంటి మీద దాడి చేస్తే తాను ఎందుకు ఊరుకుంటానని ప్రశ్నించారు. తాము వీర మహిళలపై దాడి చేయలేదని.. వాళ్లే తమను పచ్చి బూతులు తిట్టారని అన్నారు. అలా చేస్తుంటే వారిని తమవాళ్లు తీసుకెళ్లి గుడిలో పెట్టడం జరిగిందని చెప్పారు.
తాము కూడా సినిమా ఫీల్డ్‌లో ఉన్నామని.. ఎగ్జిబిటర్‌లుగా చేశామని చెప్పారు. చిరంజీవి, పవన్ సినిమాలు ఎక్కువగా తమ థియేటర్లలో నే ఆడాయని తెలిపారు. పవన్ చరిత్ర గురించి తనకు బాగా తెలుసునని.. కావాలంటే బయటపెడతానని చెప్పారు. 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని.. ఇక్కడ తాను ఓడిపోతే పవన్ చెప్పిన మాటలు నిజమని.. తాను గెలిస్తే పవన్ చెప్పినవి అబద్దాలు.. అని ప్రజలు తేలుస్తారని అన్నారు.
వంగవీటి రంగాను చంపిది చంద్రబాబు, కొడెల అని ఆరోపించారు. అలాంటిది కాపు వ్యక్తి అయిన పవన్ కల్యాణ్.. రంగాను చంపిన పార్టీ కోసంపనిచేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు రెడ్డి సామాజిక వర్గం అంటే గిట్టదని విమర్శించారు. కాకినాడలో గంజాయి పెరిగిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు సంపాదించుకునేందుకు గంజాయిని ప్రోత్సహించారని ఆరోపణలు చేశారు. గంజాయిని అరికట్టేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ డ్రగ్స్ తీసుకుంటారని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతారని అన్నారు.
కులాల మధ్య చిచ్చుపెట్టడమే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పని అని విమర్శించారు. ప్రాణహాని ఉందని పవన్ చెప్పడం.. సింపతీ కోసం ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిది ఒకరి హాని చేద్దామనే మనస్తత్వం కాదని అన్నారు. చంద్రబాబుతోనే చాలా డేంజర్ అని ఆరోపణలు చేశారు. చంద్రబాబు వల్లనే పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు.