Duvvada Suspended from YSRCP: చిలక కొట్టుడు కొడితే చిన్నదానా.. పలకమారిపోతావే పడుచుదానా అని హీరో అంటే.. రాటుదేలి పోయావు నీటుగాడా.. నీ నాటు సరసం చాలులే పోటుగాడా అని హీరోయిన్ బదులిస్తుంది.. ఇది ఓ పాత పాటలో హీరో హీరోయిన్ల మధ్య డ్యూయట్ సాంగ్. అయితే.. సరిగ్గా ఇలాంటి పాటలే దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాడుకున్నారు. ఇప్పుడు మాత్రం కథ రివర్స్ అయ్యింది. దువ్వాడకు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న చందంగా పరిస్థితి మారింది. ఏదైనా మూడో కంటికి తెలియకుండా సాగినంత కాలం పర్వాలేదు. ఒక్కసారి బయటపడిన తర్వాత.. జాగ్రత్త పడాలి లేదా అయినోళ్లతో కాళ్ల బేరానికి వెళ్లాలి. ఇవేమీ శీను చేయలేదు. అందుకే సీన్ రివర్స్ అయ్యింది. దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆ రెండు తప్పులే అతని ఆల్‌మోస్ట్ రాజకీయ జీవితానికి రెడ్ కార్డు పడేలా చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ నిన్న మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్సీ. రీసెంట్‌గా పార్టీ క్రమశిక్షణా చర్యల పేరుతో వైసీపీ అధినేత జగన్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అధికారికంగా క్రమశిక్షణా చర్యలు అని అంటున్నా.. వాస్తవానికి అవి మాత్రమే కారణాలే కాదట. శ్రీను - మాధురి గాఢ ప్రేమలో గత కొన్ని నెలలుగా ఉంటున్నారు. ఈ ప్రేమ బండ కార్యక్రమం టీవీల్లో, ఫోనుల్లో ఎక్కడపడితే అక్కడ ప్రజలందరూ వీక్షించారు. కానీ అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేచిందన్నట్లు.. పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి సస్పెండ్ చేయాల్సి వస్తే శ్రీనుని ఎప్పుడో చేయాల్సింది.
దువ్వాడకు అన్ని విషయాల్లో దూకుడెక్కువ. భార్య ఉండగానే.. మాధురి అనే మహిళతో సంసార సాగరం ఈదాడు. ఈ విషయాన్ని వారే పచ్చిగా అనేక సందర్బాల్లో టీవీల్లోకి వచ్చి చెప్పారు. ఇక భార్య రివర్స్ అవగానే.. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు నవయువ ప్రేమ జంట పోరాడింది. చివరికి శ్రీను, మాధురి జంట ప్రేమలో విజయం సాధించారు. ఇక ఎప్పుడూ కోర్టు తిప్పలు ఉండనే ఉన్నాయి. ఇంత వరకు బానే ఉన్న దువ్వాడ మాధురి ప్రేమ సినిమాలో.. సెకండాఫ్ మంట కలిసిపోయింది.
నిండా మునిగినోడికి చలి ఎందుకు అన్నట్లు.. అక్రమ సంబంధం, సహజీవనం, ప్రేమ ఇలా అనేక పదాలతో శ్రీను, మాధురి జంట టీవీల్లో రచ్చరంబోలా చేస్తున్నా వైసీపీకి చెందిన ఎవరూ పల్లెత్తి మాట అనలేదు. దీంతో ఇద్దరూ రెచ్చిపోయారు. శృతి మించి రాగాన పడినట్లు.. ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు తర్వాత పవన్ కల్యాణ్ సీఎం అవుతారా అని ఓ టీవోళ్లు దువ్వాడ జంటను అడిగారు. దీనికి మాధురి వెంటనే పవన్‌కు అంత సీన్ లేదు.. లోకేష్ మంచి రాజకీయ నాయకుడు.. అతనే సీఎం అవుతాడు.. లోకేష్ బాబు సీఎం అని ఇద్దరూ చాలా హ్యాపీగా చెప్పారు. ఇదీ.. ఈ ఒక్కమాటే వైసీపీ అధినాయకత్వం గుండెల్లో కలుక్కుమంది.
పార్టీ పరువు రోడ్డుమీదకు ఈడ్చినా మౌనంగా ఉన్నాం.. భార్యని కొడుతూ.. కూతురిని తిడుతూ మహిళ సభ్య సమాజం తలిదించుకునేలా ఉన్నా చూడీచూడనట్లు ఉన్న వైసీపీ నాయకత్వానికి లోకేష్ సీఎం కావాలని ఉందని మాధురి, శ్రీను జంట చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. సహజంగా చంద్రబాబు సీఎం అయ్యారు తర్వాత పవన్ కల్యాణా అని వైసీపీ ఎమ్మెల్సీని ఎవరైనా అడిగితే మోకాళ్లో బుర్ర ఉన్నోడు ఎవడైనా మా జగనన్న సీఎం కావాలి అని చెప్పాలి కదా.. దానికి విరుద్దంగా లోకేష్ భజన చేయడం, హీరోని చేయడం చూస్తే.. ఎక్కడో కాలింది.
ఇక రెండో ప్రధాన కారణం.. దువ్వాడ ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉంటున్న ఇంటికి గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదట. అందుకు విద్యుత్తుశాఖ వారు వచ్చి ఫీజ్ పీక్కెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దువ్వాడ గారు కరెంట్ ఉద్యోగులకు చేసి బండబూతులు తిట్టారంట. ఇక ఆ ఉద్యోగి సామాజిక వర్గం గ్రూపుల్లో దువ్వాడ వారి బూతులు విపరీతంగా షేర్ అయ్యాయంట. దీంతో పార్టీ పరువుకు భంగం కలిగినట్లు వైసీపీ అధిష్టానం భావించిందని టాక్. ఆ క్రమంలోనే టెక్కలి ఇంఛార్జిగా దువ్వాడను తొలగించి కొత్తవారిని నియమించాలని చూసింది. కానీ అప్పుడు దువ్వాడ.. ఇంఛార్జిగా తొలిగిపో అంటే.. నేను పోను ప్రజల్లోనే ఉంటా.. ప్రజలతో ఉంటా అని అన్నారంట. దీని ఉద్దేశం ఏంటి.. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.... మరోపార్టీకి వెళ్తాననే కదా అని అర్థం చేసుకున్న వైసీపీ నాయకత్వం.. పూర్తిగా సర్దుకోమని అఫీషియల్‌గా బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
ఏది ఏమైనా మాధురి వచ్చిన వేళా విశేషం.. గత పదిహేనేళ్లుగా దువ్వాడ రాజకీయాల్లో ఉంటూ.. అంతో ఇంతో పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థులతో బలంగా పోరాడతాడు అని మెప్పించుకున్నాడు. కానీ ఆమె వలలో పడిన తర్వాత.. ఈత మర్చిపోయిన చేపలా మారిపోయాడు. అంతేకాకుండా.. మీడియా అడిగినా అడక్కపోయినా ఇంటర్వ్యూలు ఇవ్వడం అక్కడ ఏదీ పడతే అది మాట్లాడటం కూడా కొంపముంచింది. ముఖ్యంగా లోకేష్ అంశం ఎత్తకుండా ఉంటే.. దువ్వాడ పదికాలాలు వైసీపీలోనే పచ్చగా ఉండేవాడని విశ్లేషకులు అనుకుంటున్నారు. మాధురి వచ్చిన తర్వాత రాజకీయ, వ్యక్తిగత తలరాతే మారిపోయిందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు దువ్వాడ ప్రస్తుతానికి హ్యీపీగా ఉన్నట్లు కనిపించినా.. అతని రాజకీయ జీవితం క్లోజ్ అని అనిపిస్తోంది. ఈ తరుణంలో ఒకప్పటి ఆ ''మాధుర్యిం'' దువ్వాడతో ఉంటుందా లేదో చూడాలి.