దుర్గగుడి వెండి సింహాల దొంగ బాలకృష్ణ !!

By AN TeluguFirst Published Jan 21, 2021, 11:54 AM IST
Highlights

కలకలం సృష్టించిన బెజవాడ దుర్గమ్మ వెండిసింహాల దొంగతనం కేసు కొలిక్కి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉన్న 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడే ఈ చోరీకి పాల్పడినట్టు సమాచారం. 

కలకలం సృష్టించిన బెజవాడ దుర్గమ్మ వెండిసింహాల దొంగతనం కేసు కొలిక్కి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉన్న 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడే ఈ చోరీకి పాల్పడినట్టు సమాచారం. 

గతేడాది సెప్టెంబర్ లో దుర్గమ్మ వెండిరథంపై సింహాల ప్రతిమలు మాయమైనట్లు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. ఆలయంలో పనిచేసే సిబ్బందితో పాటు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో 
పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్తులు 40 మందిని విచారించారు.

అయినా ఒక్క క్లూ దొరకలేదు. ఆలయంలో సీసీ కెమెరాల ఫుటేజీ లేకపోవడంతో ఇంటి దొంగలను కాపాడే ప్రయత్నంలోనే ఆలయ సిబ్బంది సహకరించడం లేదనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. 

అయితే, ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు సమాచారం. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దొంగతనాల కేసులో బాలకృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో దుర్గగుడిలో వెండి సింహాలను తనే అహరించినట్టు అంగీకరించాడు.

దీంతో ఈ విషయాన్ని వెంటనే విజయవాడ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించి కీలక విషయాలను రాబడుతున్నట్లు తెలిసింది. 

వెండి సింహాలను బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి వీటిని అమ్మేశాడు. ప్రస్తుతం ఆ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి ప్రతిమలను తీసుకున్న వ్యాపారి వెంటనే వాటిని కరిగించాడని, వాటి బరువు దాదాపు 16 కిలోలు ఉందని చెబుతున్నారు. 

అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ప్రస్తుతం దుర్గగుది అధికారులు, సిబ్బంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పోలీసులు అనుమానితుడిని రెండు,మూడు రోజుల్లో అరెస్ట్ చూపించే అవకాశం ఉందని సమాచారం. 

click me!