
సమస్యలపై అదికూడా రుణమాపీ అమలుతీరుపై రైతులతో మాట్లాడటమంటే సచివాలయంలో కూర్చుని మీడియా సమావేశం పెట్టినంత తేలికనుకున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తీరా రైతులతో మాట్లాడటం మొదలైన తర్వాత కానీ అర్ధంకాలేదు సమస్య లోతెంతో. అందుకే వారికి సమాధానం చెప్పలేక అక్కడనుండి చల్లగా జారుకున్నారు.
ఇంతకీ విషయమేంటంటే, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సొంత జిల్లా రైతులే షాక్ ఇచ్చారు. అదికూడా రైతు రుణమాఫీపై. రుణమాఫీ అందని రైతుల కోసం జిల్లా కలెక్టర్ నెల్లూరులో శనివారం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డి కూడా హాజరయ్యారు. అయితే, అధికారులు ఊహించినదానికన్నా ఎక్కువ మంది రైతులు హాజరయ్యారు. కార్యక్రమం మొదలుకాగానే రైతులందరూ మంత్రిని చుట్టుముట్టారు. అర్హతున్నా తమకు రుణమాఫీ ఎందుకు అమలు కావటం లేదంటూ నిలదీసారు.
ఒక్కసారిగా వందలాదిమంది రైతులు మంత్రిని చుట్టుముట్టటంతో అధికారులు భయపడిపోయారు. రుణమాఫీ జరుగుతున్న తీరుపై రైతులు మండిపడ్డారు. రెండో విడతలో రుణమాఫీ బాండ్లు ఇస్తున్నట్లు చెప్పినా ఎందుకు ఇవ్వలేదని మంత్రిని నిలదీసారు. దాంతో మంత్రి బిత్తరపోయారు. ఒక్కసారిగా రైతులు ప్రశ్నల వర్షం కురిపించటం, అందులోనూ తమ సమస్యలను రైతులు ఏకరువుపెట్టడంతో ఏం సమాధానం చెప్పాలో సోమిరెడ్డికి అర్ధం కాలేదు. దాంతో పేర్లు నమోదులో ఏదో సాంకేతిక లోపం తలెత్తిందని, సమస్యను పరిష్కారిస్తామంటూ అక్కడి నుండి మంత్రి జారుకున్నారు.