
మద్యం మత్తులో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. తనకు ఏమాత్రం తెలియని వ్యక్తులకు మద్యం పోయించమని అడిగాడు. దానికి వారు నికాకరించడంతో గొడవకు దిగి ఇద్దర్ని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చోటుచేసుకుంది.
కాకినాడ పట్టణంలోని అశ్విన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బార్ లో సరదాగా మద్యం తాగేందుకు వనమాడి రాజు, దుర్గాప్రసాద్, రాజేశ్ అనే ముగ్గురు స్నేహితులు వెళ్లారు. అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి వున్న నూకరాజు అనే తనకూ మద్యం పోయాలని వారికి అడిగాడు. అయితే అతడేవరో కూడా తెలియక పోవడంతో మందు పోయించడానికి వారు నిరాకరించారు.
దీంతో తనకు మందు పోయించనందుకు మీ అంతు చూస్తా అంటూ నూకరాజు వీరితో గొడవకు దిగాడు. తన దగ్గర వున్న కత్తితో వీరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడటంతో వనమూడి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్, రాజేష్ లు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గా ప్రసాద్ కూడా మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నూకరాజును అరెస్ట్ చేశారు. ఇతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.