రాజనర్తకిలా జెసి, సిగ్గులేకుండా బాబు ముసి ముసి: బొత్స

First Published May 31, 2018, 10:34 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ  మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పించేందుకు పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి పడినపాట్లు చూస్తుంటే ప్రాచీన కాలంలో రాజులను మైమరపించే రాజనర్తకిలా ఉందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ  మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పించేందుకు పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి పడినపాట్లు చూస్తుంటే ప్రాచీన కాలంలో రాజులను మైమరపించే రాజనర్తకిలా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దివాకర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే చంద్రబాబు ముసిముసిగా నవ్వుకోవడం సిగ్గు చేటు అని అన్నారు.

గుంటూరులోని కేకేఆర్‌ కల్యాణమండపంలో బుధవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెసు గుంటూరు పార్లమెంటరీ జిల్లా యువజన అధ్యక్షుడు బూరెల దుర్గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దివాకర్‌రెడ్డికి వయస్సు పెరిగిందే గాని బుద్ధి పెరగలేదని ఆయన అన్నారు. గతంలో తాడిపత్రి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పోటీ పెట్టలేని దుస్థితిలో హైదరాబాద్‌కు పారిపోయి వస్తే డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పోటీకి నిలిపి గెలిపించారని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్రంలో పంచభూతాలను సైతం దోపిడీ చేస్తున్నారని ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. మహానాడు జరిగిన మూడు రోజుల్లో రాజధాని నిర్మాణం, ప్రజలకు చేసిన వాగ్దానాలు, ప్రమాణ స్వీకారం నాడు చేసిన ఐదు తొలి సంతకాలపైన చర్చ జరగకపోవడం శోచనీయమన్నారు. 

మహానాడు ఆత్మస్తుతి పరనిందలకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.. రైతులకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్య చేసుకుంటుంటే పిండివంటలతో పండుగలా మహానాడు నిర్వహించుకోవడం సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. 
 

click me!