
కాకినాడ : కాకినాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. కొరియర్ ద్వారా కాకినాడ కు డ్రగ్స్ తెప్పించిన ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మన్యం ప్రాంతం మంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్ లుగా చేసి విక్రయిస్తున్న ఈ నిందితులు ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ ను నగరంలోకి తరలించడం కలకలం రేపింది. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కె.రాహుల్ గతంలో ఎల్ఎస్ డి (లిజెరిక్ యాసిడ్ డైఇథలమైడ్) పేపర్ డ్రగ్స్ కేసులో పాత నేరస్తుడు.
అతను డార్క్ వెబ్ సైట్ల ద్వారా ఆన్లైన్ లో ఎండీఎంఏ (డ్రగ్స్) మాత్ర లను కొనుగోలు చేశాడు. అతడి నుంచి కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడికి చెందిన నాగిరెడ్డి సుభాష్, ఉమిడి ఇమాన్యుయేల్ కు డీటీడీసీ కొరియర్ ద్వారా గత నెల 28న 15ఎన్డిఎంఎ మాత్రలు వచ్చాయి. మంగళవారం రాహుల్, సుభాష్, ఇమాన్యుయేల్ వాకలపూడిలోని ఓ ఖాళీ ప్రదేశంలో సమావేశమయ్యారు. వారు డ్రగ్స్, గంజాయి కలిగి ఉన్నారన్న ముందస్తు సమాచారంతో సర్పవరం సీఐ మురళీకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
12 ఏళ్ల తర్వాత కన్నా,రాయపాటి మధ్య రాజీ: రాయపాటిపై పరువు నష్టం దావా వెనక్కి
నిందితుల నుంచి 15 ఎండీఎంఏ మాత్రలతోపాటు మూడు కేజీల గంజాయి, ఎనిమిది ఫోన్ లను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఇమాన్యుయేల్ ఇచ్చిన సమాచారం మేరకు వాకలపూడి లోని అతని ఇంటి వద్ద గంజాయి కలిగి ఉన్న శివదుర్గ, సాయి కుమార్, రాంప్రసాద్, సుధాకర్ ఠాగూర్ లను అరెస్టు చేసి మరో రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 15 టాబ్లెట్ లు ధర రూ. 12 వేలు, 5 కేజీల గంజాయి విలువ రూ.15వేలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.