‘‘సుబ్బిశెట్టి’’ కోసం రోడ్డున పడేస్తారా: చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల ఆగ్రహం

By Siva KodatiFirst Published Jan 19, 2022, 2:35 PM IST
Highlights

ఏపీలో చింతామణి నాటకం నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి నాటక సంఘాలు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో నాటక సంఘాలు సమావేశమయ్యాయి. తమతో సంప్రదించకుండా ఎలా నిషేధం విధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.


ఏపీలో చింతామణి నాటకం నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి నాటక సంఘాలు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో నాటక సంఘాలు సమావేశమయ్యాయి. తమతో సంప్రదించకుండా ఎలా నిషేధం విధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక పాత్ర కోసం చింతామణి నాటకంపై ఆధారపడే జీవితాలను రోడ్డున పడేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రతో అశ్లీలత చూపించి కొన్ని నాటక సంస్థలు ఘోర తప్పిదం చేశాయన్నారు. అవసరమైతే సినిమాల తరహాలో నాటకాలకు సెన్సార్ బోర్డ్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. మరి అభ్యంతరకరంగా వుంటే సుబ్బిశెట్టి పాత్రను తప్పించాలని విజ్ఞప్తి చేశారు. చింతామణి నాటకం నిషేధంపై త్వరలో ప్రభుత్వాన్ని కలుస్తామని వారు వెల్లడించారు. 

కాగా.. ఏపీలో Chintamani drama మీద రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుడదని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడో దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. 

ఇప్పటికీ ఊరూరా ప్రదర్శితమవుతూనే ఉంటుంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింపబడింది. తాజాగా ఈ నాటకాన్ని రాష్ట్రంలో నిషేధించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. 

click me!