Corona Cases in AP:ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్ కి కోవిడ్ పాజిటివ్

By Arun Kumar PFirst Published Jan 19, 2022, 2:18 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా చాలామంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా ఏపిసిసి చీఫ్ శైలజానాథ్ కు కూడా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా (corona virus) విజృంభణ కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్ లో బీభత్సం సృష్టించిన కరోనా థర్డ్ వేవ్ (corona third wave) ఇటీవలే మొదలయ్యింది. ఈ ఉదృతి రోజురోజుకు మరింత పెరుగుతూ వేలలో కేసులు భయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యులనే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను సైతం ఈ కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఎప్పుడూ ప్రజల్లో వుండే రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇలా తాజాగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ (sake shailajanath) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.  

కోవిడ్ (covid19) నిబంధనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వైరస్ సోకిందని శైలజానాథ్ పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికయితే తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. 

కరోనా నిర్దారణ అయిన నేపథ్యంలో డాక్టర్లను సంప్రదించానని... ఎలాంటి సమస్యా లేకపోవడంతో హోం ఐసోలేషన్ లో వుండాలని సూచించినట్లు తెలిపారు. కాబట్టి తన అనుచరులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని శైలజానాథ్ సూచించారు. 

ఇటీవల కాలంలో తనను కలిసి వారు ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని శైలజానాథ్ సూచించారు. తాను కొన్నిరోజులు అందుబాటులో వుండనని... అత్యవసరం అయితే ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తానని తెలిపారు. త్వరలోనే కరోనా నుండి కోలుకుని అందరికీ అందుబాటులోకి వస్తానని శైలజానాథ్ వెల్లడించారు.  

ఇక ఇప్పటికే తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి (revanth  reddy) కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికన వెల్లడించారు. 

"నాకు కరోనా వైరస్ సోకింది. తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజటివ్ గా వచ్చింది. ఇటీవల నన్ను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకొండి" అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.   

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టుగా చెప్పారు. మంత్రులు కొడాలి నాని,  అవంతి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. స్వల్ఫ లక్షణాలుండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు.  తమను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. 

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా కరోనా బారిన పడ్డారు.  సూచించారు.  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి దంపతులకు కూడా కరోనా సోకింది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావు (keshav rao) కూడా కరోనా బారినపడ్డారు.   

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (errabelli dayakar rao) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. 

ఇక టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చేసారు. అయితే ఆయన కోవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.  

click me!