
వైఎస్ జగన్ చిత్తశుద్దిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుపైన, ప్రత్యేకహోదా సాధన వ్యవహరంలోనూ జగన్ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయిన్ని ప్రధానమంత్రి ప్రకటించిన రెండు రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో అప్రమత్తమైన ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఐకమత్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
జాతీయ స్ధాయిలోని ప్రతిపక్షాల డిమాండ్, రాష్ట్రంలో జగన్ డిమాండ్ ఒకటే. నోట్ల రద్దుపై ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నదే ప్రధానంగా వినబడుతున్న డిమాండ్. పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గర నుండి ప్రతిపక్షాలన్నీ ఐక్యంగానే ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. మరి, పార్లమెంట్లో ఎనిమిది మంది సభ్యులున్న వైసీపీ తన నిరసన గళాన్ని ఎందుకు వినిపించటం లేదు. పోనీ మిగిలిన విపక్షాలతోనూ కలుస్తున్నదా అంటే అదీ లేదు. ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలతో వైసీపీ కలుస్తున్నట్లు మీడియాలో ఎక్కడా కనబడటం లేదు.
పోనీ, రాష్ట్రంలో అన్నా ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారా అంటే అదీ కనబడటం లేదు. నోట్ల రద్దై ఇప్పటికి 15 రోజులైన తర్వాత తీరిగ్గా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. 15 రోజుల తర్వాత స్పందిస్తున్నందకు ఆయన చెప్పుకున్నకారణాన్ని కూడా ఎవరూ నమ్మరు. అన్నీ విషయాలను మైండ్ తో గమనించిన తర్వాత మాత్రమే తాను స్పందిస్తున్నట్లు జగన్ చెప్పుకున్నారు.
దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, విస్తృతమైన పార్టీ యంత్రాంగమున్న జగన్ స్పందించటానికి ఇన్ని రోజులు పట్టడం ఆశ్చర్యమే. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి.పోనీ వాటినన్నా కలుపుకుని పో తున్నారా అంటే అదీ లేదు. ఇంత వరకూ ప్రతిపక్షాలతో కలిపి ఐక్య ఉద్యమాలు నిర్వహించే ఉద్దేశ్యాన్ని కూడా జగన్ వెల్లడించలేదు.
అంతే కాకుండా ప్రత్యేకహోదా అంశంలో కూడా జగన్ చేసిన, చేస్తున్న ఆందోళనలన్నీ ఒంటరిగా చేపడుతున్నవే. ఏ విపక్షాన్ని కలుపుకుని పోయేందుకు ఎప్పుడూ ఓ ప్రయత్నం కూడా చేయలేదు. అధికార పక్షాలపై ఒత్తిడి పెట్టాలనుకుంటున్నపుడు కలిసి వచ్చే ప్రతిపక్షాలను కలుపుకుని పోవటంలో చొరవ చూపటం లేదు. ఇక్కడే జగన్ చిత్తశుద్దిపై అనుమానాలు వస్తున్నాయి.