
తన బాధ్యతలను ఎవరూ తనకు గుర్తు చేయనక్కర లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాపుల ఆవేదనను తాను అర్ధం చేసుకున్నానని అన్నారు. విజయవాడలో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.
కాపు రిజర్వేషన్లపై పిఠాపురం సభలో తానే హామీ ఇచ్చానని చంద్రబాబు పెర్కొన్నారు. కాపులకు జరిగిన అన్యాయాన్ని తాను గ్రహించి హామీ ఇచ్చానని తెలిపారు. తాను ఇచ్చిన హామీలను ఎవరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదని బాబు పెర్కొన్నారు. కాపుల సమస్యలు జిఒలతో తీరదనే బిసి కమిషన్ వేశామని ఆయన చెప్పారు. నివేదిక రాగానే కాపుల సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలు ఏ సామాజికవర్గంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అండగా సీఎం చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ హయాంలోనే కాపుల రిజర్వేషన్లను తొలగించారని, కాపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు తమ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని సీఎం ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా జగన్ కాపులను కావాలనే రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కొందరు బీసీలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.
విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు.