ఈ నెల 25వ తేదీ వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్నటి నుండి సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం నుండి ఇవాళ సాయంత్రం వరకు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ, వైఎస్ అవినాష్ రెడ్డి , వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఇవాళ మధ్యంతర తీర్పు ఇచ్చింది.. ఈ నెల 25న ఈ విషయమై తుది తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది.
undefined
ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు పిలిస్తే విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించింది హైకోర్టు.
వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నిన్న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న మధ్యాహ్నం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు కొనసాగింపుగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుండి విచారణ నిర్వహించింది తెలంగాణ హైకోర్టు.
ఇవాళ మధ్యాహ్నం లంచ్ తర్వాత సీబీఐ, వైఎస్ అవినాష్ రెడ్డి,వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. దస్తగిరి వాంగ్మూలం మినహా వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. గూగుల్ టేకవుట్ డేటాపై ఆధారపడడం సరైందికాదన్నారు.. సునీల్ కదలికలు, దస్తగిరి వాంగ్మూలం విరుద్దంగా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతీసారి అవినాష్ రెడ్డి కోర్టుకు వస్తున్నారని వైెస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు, సాక్షులు అవినాష్ రెడ్డి ప్రమేయంపై సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదించారు.
also read:'వివేకా హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం': ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్ననికి వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఎప్పటిలోపుగా పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలు ఏమిటని హైకోర్టు అడిగింది. కుటుంబంలో ఆస్తి తగాదాలు, వ్యాపార లావాదేవీల్లో గొడవల అంశాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఈ వాదనలతో సీబీఐ విబేధించింది.
ముగ్గురి వాదనలు విన్న తర్వాత ఈ నెల 25వ తేదీ వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరో వైపు ఈ నెల 25న ఈ పిటిషన్ పై విచారించనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.