
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల సీబీఐకి కస్టడీకి అనుమతించింది సీబీఐ కోర్ట్. దీంతో వారు రేపటి నుంచి ఈ నెల 24 వరకు సీబీఐ కస్టడీలోనే వుండనున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వీరిద్దరిని విచారించాలని సీబీఐ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని సూచించింది.
కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సిబిఐ అరెస్టులను ప్రారంభించడం అవినాష్, భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా పులివెందులోని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లకు సిబిఐ అధికారులు చేరుకోవడంతో అలజడి మొదలయ్యింది. అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతుండగా తాజాగా సిబిఐ అధికారులు అవినాష్ ఇంటికి చేరుకోవడంతో ఏదో జరగబోతోందని అందరూ భావించారు. చివరకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.