వైఎస్ కుటుంబంలో విభేదాల వల్లే తెలంగాణలో షర్మిల పార్టీ.. : డీకే అరుణ

By Sumanth KanukulaFirst Published Jul 31, 2022, 10:06 AM IST
Highlights

భద్రాచలంపై వదర ప్రభావానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం.. టీఆర్ఎస్, వైసీపీల రాజకీయ గేమ్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. అలాగే.. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయడంపై కూడా డీకే అరుణ స్పందించారు. 

భద్రాచలంపై వదర నీటి ప్రభావానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం.. టీఆర్ఎస్, వైసీపీల రాజకీయ గేమ్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆమె శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న గ్రామాలను.. అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణలో కలపాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. అక్కడ మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు తీర్చకపోవడంతో ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. 

పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన అవగాహన ఉందని డీకే అరుణ అన్నారు. వైసీపీ, టీఆర్ఎస్‌లు..  ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాస్పద అంశాలను తమకు అనుకూలంగా మలుచుకున్నాయని.. తర్వాత వాటిని మరచిపోయాయని విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే..  తాము కలలుగన్న తెలంగాణ సాకారమవుతుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 

ఇక, తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయడంపై కూడా డీకే అరుణ స్పందించారు. వైఎస్ షర్మిల ఎన్నికల్లో గెలవడం కష్టమైన పని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగానే కొనసాగుతోందని చెప్పారు. వైఎస్సార్ కుటుంబ విభేదాలు, ఇతర కారణాల వల్ల షర్మిల పార్టీ పెట్టిందని అన్నారు. షర్మిల లాంటి వారిని తెలంగాణ ప్రజలు అంత తేలిగ్గా నమ్మరని కామెంట్ చేశారు. గతంలో ఆమె తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టి పెరిగానని చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు ఆమెకు మద్దతు ఇవ్వరని అన్నారు. 
 

click me!