
Guntur: ఇప్పటివరకు ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన మంకీపాక్స్ వ్యాధి ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఆఫ్రికా వెలుపలి దేశాలకు మంకీపాక్స్ విస్తరించడంతో పాటు పలు దేశాల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అన్ని దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ దీని వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్ లోనూ మంకీపాక్స్ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇదివరకు ప్రభుత్వం పేర్కొన్న ఏ చిన్న లక్షణాలు, చర్మ సంబంధ అలర్జీలు కనిపించినా ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఓ చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయని సమాచారం. గుంటూరులో ఎనిమిది ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు శనివారం నాడు వెల్లడించారు. ఆ బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమయ్యాఖాన్ మాట్లాడుతూ.. "ఇది మంకీపాక్స్‌గా అనుమానించబడిన కేసు. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ బాలుడిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. నిర్ధారణ కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి శాంపిల్స్ ను పంపిస్తున్నాము" అని తెలిపారు. దీనిపై నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు కేసులు కేరళలో గుర్తించారు. మరోకటి ఢిల్లీలో నమోదైంది. ఇదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అనుమానిత కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. మంకీపాక్స్ వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకున్నందున ఎటువంటి భయాందోళన అవసరం లేదని తెలిపారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ పాల్ మాట్లాడుతూ.. అనవసరమైన భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదని నొక్కిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, దేశ ప్రజలు మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అన్నారు. "ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ వారు ఏవైనా లక్షణాలను గుర్తించినట్లయితే సకాలంలో నివేదించాలి " అని చెప్పారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 78 దేశాల్లో 18,000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. "దేశాలు, సంఘాలు-వ్యక్తులు తమను తాము తెలియజేస్తే, ప్రమాదాలను తీవ్రంగా పరిగణించి, ప్రసారాన్ని ఆపడానికి-హాని కలిగించే సమూహాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్ వ్యాప్తిని ఆపవచ్చు" అని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గురువారం అన్నారు. మంకీపాక్స్ అనేది మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే జూనోటిక్ వ్యాధి.ఇది మశూచికి కారణమయ్యే అదే వైరస్ల కుటుంబానికి చెందినది.