హైకోర్టు విభజనపై గందరగోళం: ఏపి న్యాయవాదుల నిరసన

By pratap reddyFirst Published Dec 27, 2018, 1:35 PM IST
Highlights

విభజనపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి కాకుండానే విభజన తేదీని ఇచ్చారని, అరకొరా ఏర్పాట్లతో ఎలా పనిచేయాలని వారంటున్నారు. విభజనపై హైదరాబాదులోని ఉమ్మడి హైకోర్టులో గందరగోళం చోటు చేసుకుంది.

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోర్టులు విడివిడిగా పని చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ బుధవారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

విభజనపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి కాకుండానే విభజన తేదీని ఇచ్చారని, అరకొరా ఏర్పాట్లతో ఎలా పనిచేయాలని వారంటున్నారు. విభజనపై హైదరాబాదులోని ఉమ్మడి హైకోర్టులో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో చీఫ్ జస్టిస్ బెంచ్‌ దిగి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. 

ఉమ్మడి కేసులపై స్పష్టతపై లేదని ఏపి న్యాయవాదులు అంటున్నారు. సిబ్బంది, ఫైళ్ల విభజన జరగలేదని, ఏపీలో కొత్త భవనాలు ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులు అంటున్నారు. మూడు రోజుల్లో అమరావతికి ఎలా వెళ్తామని వారు ప్రశ్నిస్తున్నారు.

హైకోర్టు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ద్వారా కటాఫ్ డేట్ ను పొడిగించాలని వారు కోరుతున్నారు.  రాష్ట్ర విభజన తరువాత అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వం అక్కడే హైకోర్టు తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దేశంలోని 25వ హైకోర్టు కానుంది. 

ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనంలోనే తెలంగాణ హైకోర్టు పనిచేస్తుంది. అయితే, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకు సిఎం క్యాంప్ ఆఫీసును హైకోర్టుకు వాడాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడ కూడా సాధ్యం కాకపోతే హైదరాబాదులో విడిగా కొంత కాలం నడుపుకోవచ్చునని అంటున్నారు. 

click me!