
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై (bifurcation issues) జరిగిన త్రిసభ్య కమిటీ తొలి భేటీలో (three man committee) ఐదు ప్రధానాంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లుగా తెలుస్తోంది. సివిల్ సప్లయిస్ కార్పోరేషన్‌ల ఆర్ధిక వ్యవహారాలు, అలాగే విద్యుత్ బకాయిలు, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన వ్యవహారాలపై త్రిసభ్య కమిటీ భేటీలో చర్చ జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు అంశాల వారీగా వాదనలు వినిపించారు. సంబంధిత శాఖలు పరస్పర చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే కేంద్రమే ఈ అంశాలపై ఒక నిర్ణయానికి రావాలంటున్నాయి తెలుగు రాష్ట్రాలు.
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏనిమిదేళ్లు గడస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ విభజన వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ త్రిసభ్య కమిటీ గురువారం సమావేశం అయింది. వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు, ఏపీ నుంచి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్ హాజరయ్యారు.
అజెండాలోని అంశాలు..
-ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన
- పౌరసరఫరాల సంస్థ ఆర్థిక అంశాలపై చర్చ
-ఏపీ జెన్‌కో సంస్థకు తెలంగాణ డిస్కంల బకాయిలపై చర్చ
-పన్నుల విధానం
- బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాలపై చర్చ
ఇకపోతే.. ఈ త్రిసభ్య కమిటీ భేటీకి ముందే వివాదం రేగింది. ఈ సమావేశం అజెండాలో తొలుత ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు మొత్తం 9 అంశాలను పెట్టారు. దానితో ప్రత్యేకహోదా (special status) అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే అజెండాను పరిమితం చేసింది.