
ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) పేర్కొన్నారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఫ్లైఓవర్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయమని గడ్కరీ అన్నారు. పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
రహదారుల నిర్మాణానికి నిధుల కొరతలేదని.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరగాల్సి వుందని గడ్కరీ చెప్పారు. దాదర్ ఎక్స్‌ప్రెస్ వే తనకు కూడా చాలా ప్రత్యేకమైందన్న ఆయన.. నా నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి విజయవాడకు రోడ్ వస్తుందని గడ్కరీ తెలిపారు. ఏపీలో 6 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామని.. 2024లోగా రాయ్‌పూర్- విశాఖ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు.
అంతకుముందు.. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ది వేగంగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) తెలిపారు. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు ముందడుగులు పడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు అని సీఎం జగన్ చెప్పారు.
కేంద్రం అండతో రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ తెలిపారు. రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భూ సేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. జాతీయ రహదారులు కాకుండా రాష్ట్రంలోని ఇతర రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు.
వాటి అభివృద్దికి రూ. 10,600 కోట్లను కేటాయించినట్టుగా సీఎం జగన్ తెలిపారు. ఏపీలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్య లేకుండా బైపాస్‌ల అభివృద్దికి, విశాఖపట్నం-భోగాపురం మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి, ఈస్టర్న్ బైపాస్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్దికి తెలుగువారైన కిషన్ రెడ్డి (kishan reddy) సహకరిస్తున్నారని.. ఆయన నుంచి మరింత సహకారం కావాలని సీఎం జగన్ ఆకాక్షించారు.