
సినిమా టికెట్ల ధరపై (movie ticket rates) ప్రభుత్వం నియమించిన కమిటీ సర్కార్‌కు అందజేయాల్సిన సిఫారసులను సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భౌగోళికంగా నాలుగు ప్రాంతాలుగా విభజించడం, గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రత్యేక సదుపాయాలు వున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని సిఫారసు చేసింది. కార్పోరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. ఎకానమీ క్లాస్‌తో పాటు సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయి.
స్పెషల్ షోకి (special show) అనుమతి నిరాకరించింది. పెద్దా చిన్నా అన్ని చిత్రాలకు ఒకటే ధర నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లను తగ్గించి అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ టికెటింగ్‌కు సత్వర ఏర్పాట్లు చేస్తోంది. 50 శాతం ఆక్యూపెన్సీ నిబంధన ఎత్తివేసింది. ఇక రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాత సమయాల్లోనే నాలుగు ఆటలు వుంటాయి. టికెట్ రేట్లపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదికను అందజేయనుంది కమిటీ.
అంతకుముందు సినిమా టికెట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సచివాలయం రెండో బ్లాక్‌లో సమావేశమైన కమిటీ.. పలు అంశాలపై చర్చించింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో కమిటీలో సభ్యులుగా ఉన్న పలు విభాగాల ఉన్నతాధికారులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. టికెట్ల ధరలు ఎంత పెంచాలనే అంశంపై కమిటీ సభ్యులు ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశం అనంతరం తెలుగు ఫిలిం చాంబర్ వైఎస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ, ప్రజలు బాగుండాలనే అంతా భావిస్తామని చెప్పారు. టికెట్ల రేట్లపై సానుకూల నిర్ణయం వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్ అసోషియేషన్ తరఫున టికెట్ ధరల పెంచాలని అడిగామని చెప్పారు. త్వరలోనే టికెట్ల ధరలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కమిటీలో అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
టికెట్ల ధరల నిర్ణయానికి స్లాబులపై చర్చించినట్టుగా చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమను (tollywood) సంతృప్తి పరిచేలా నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరలపై 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ధరల నిర్ణయానికి థియేటర్లలో మూడు స్లాబులు ఉంటాయి. అందులో మార్పులు ఉండే అవకాశం లేదని.. దీనిపై నేడు నిర్దిష్టమైన చర్చ సాగిందని చెప్పారు. తాము అడిగిన వాటికి 99 శాతం దగ్గరగా ప్రభుత్వం అనుకూలంగా ఉందని.. 100 కోట్ల బడ్జెట్‌పై ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఉంటుందని రాందాస్ చెప్పారు. 100 శాతం సీట్ల ఆక్యుఫెన్సీ అమలులో వచ్చిందని అయితే మాస్క్ తప్పనిసరి అని ఆయన తెలిపారు.