అచ్చెన్నాయుడికి వైసిపి ప్రలోభాలు... లొంగలేదు కాబట్టే అరెస్ట్: దూళిపాళ్ల

By Arun Kumar PFirst Published Jun 12, 2020, 8:59 PM IST
Highlights

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ ను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 

విజయవాడ: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ ను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అర్థరాత్రి వందలాది మంది పోలీసులతో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలో కూడా కక్షపూరిత రాజకీయాలు చేయడం బాధాకరమని... అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజకీయ కుట్ర కాదా, బలహీన వర్గాలపై దాడి కాదా? అని నిలదీశారు. 

''స్వయంకృషితో అచ్చెన్నాయుడు రాజకీయాల్లో ఎదిగారు.దివంగత ఎర్రన్నాయుడు కుటుంబ పరపతిని దెబ్బతీసే కుట్ర వైసిపి నాయకులు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? టీడీపీలో బలహీనవర్గాల ప్రతినిధిగా ఉండటమే ఆయన చేసిన తప్పా? శాసనసభా పక్ష ఉపనేతగా ఉండటమే ఆయన చేసిన తప్పా? బలహీన వర్గాలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రశ్నించడమే ఆయన చేసిన తప్పా? సరస్వతి  సిమెంట్స్ కు సీఎం హోదాలో జగన్ 50 ఏళ్లకు లీజులు పొడిగించడాన్ని ప్రశ్నించడమే అచ్చెన్నాయుడు చేసిన తప్పా?'' అని ప్రశ్నించారు. 

''ఇవాళ ప్రతి అంశంలో లిక్కర్, మైన్, శాండ్, లాండ్ విషయాల్లో జగన్ దోపిడీ చేస్తున్నారు. దీనిని ప్రశ్నించడమే ఆయన చేసిన తప్పా? ఎంతో మంది నాయకులను ప్రభుత్వం బెదిరిస్తోంది. వైసిపి నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు వేటికీ లొంగలేదు కాబట్టి సంబంధం లేని కేసులో ఇరికించారు. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆయన పారిపోయే వ్యక్తి కాదు'' అని అన్నారు. 

''ఈఎస్ఐ లో కొనుగోళ్లన్నీ రీజనల్ డైరెక్టర్ స్థాయిలో జరిగే వాళ్లదే బాధ్యతని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు స్పష్టంగా వివరణ ఇచ్చారు. టెలీహెల్త్ సర్వీసెస్ అనేదానిలోనే అచ్చెన్నాయుడి పేరు మెన్షన్ చేశారు. టెక్నాలజీ వినియోగించే క్రమంలో టెలీహెల్త్ సర్వీస్ సంస్థ తెలంగాణలో వినియోగిస్తున్నారు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేయాలని నోట్ పంపడం జరిగింది. పలానా సంస్థకు ఇవ్వాలని అచ్చెన్నాయుడు ఎక్కడా చెప్పలేదు. టెలీహెల్త్ సర్వీసెస్ కోసం చెల్లించించి రూ.8 కోట్లు మాత్రమే'' అని వెల్లడించారు. 

read more  రెండు రాష్ట్రాల్లోనూ స్కామ్ ఒకటే...బాధ్యులే వేరువేరు: అచ్చెన్నాయుడు అరెస్ట్ పై కొల్లు రవీంద్ర

''అచ్చెన్నాయుడు అరెస్ట్ బలహీన వర్గాల మీద దాడి. కార్మికుల డబ్బులు దోచుకున్నారని వైసీపీ నేతలు దుష్ప్రచార చేస్తున్నారు. టెలీహెల్త్ అంశం మీద తప్పితే.. అచ్చెన్నాయుడు ప్రమేయం ఇతర అంశాల్లో లేదు. బీసీలంటే ఎందుకు జగన్ కు అంత కక్ష. అచ్చెన్నాయుడును చూస్తే ఎందుకు భయపడుతున్నారు? రాజకీయ కుట్రలో భాగమే అరెస్ట్. నివేదికలో టెలీ హెల్త్ సర్వీస్ తప్పితే..ఎక్కడా అచ్చెన్నాయుడు ప్రమేదం లేదని స్పష్టమవుతోంది. బలహీన వర్గాల ప్రజానీకం రాజకీయ నాయకులుగా ఎదగకూడదా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా? కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తించాలి'' హెచ్చరించారు. 

''బలహీన వర్గాల ప్రజానీకం ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ వచ్చిన తర్వాతే బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు జగన్ వారిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మందుల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు ప్రమేయం లేదు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడుని ఎదుర్కోవడం కష్టం అని భావించి అరెస్ట్ చేయించారు. నోటీసు ఇవ్వకుండా, రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవకుండా తీవ్రవాదిలా అరెస్ట్ చేశారు'' అని  దూళిపాళ్ల మండిపడ్డారు. 

click me!