అంబులెన్సులకు తాకిన వైసిపి రంగుల పిచ్చి... 1060 వాహనాలకు: ఉమ ఫైర్

By Arun Kumar PFirst Published Jun 22, 2020, 9:43 PM IST
Highlights

ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను కుంభకోణాల్లో అగ్రపథాన నిలిపిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఎద్దేవా చేశారు. 

విజయవాడ: ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను కుంభకోణాల్లో అగ్రపథాన నిలిపిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఎద్దేవా చేశారు. చివరకు ప్రజారోగ్యంతో ముడిపడిన 108 అంబులెన్సులలోకూడా రూ. 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆంబులెన్స్ లకు సంబంధించి రకరకాల జీవోల పేరుతో విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో కంపెనీకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్యాసాలను టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు. 

''జీవో నెం.111 లో ప్రభుత్వ ఖజానా నిధులను ఐడెంటిఫై చేసి ఎంగేజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ అధికారం మీకు ఎవరిచ్చారు..? ఇదేనా రివర్స్ టెండరింగ్ అంటే..? పోలవరం ప్రాజెక్టులోనూ రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ కు పాల్పడ్డారు. కడప జిల్లాలో 3 ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా రిజర్వ్ టెండరింగ్ తో మీ అనుయాయులకు కట్టబెట్టారు'' అని ఆరోపించారు.

''ఇక వైకాపా రంగులు పిచ్చి చివరకు ఆంబులెన్స్ లకు కూడా పాకిందని.. విజయవాడ మెడికల్ కాలేజీ ఆవరణలో ఆంబులెన్స్ లకు వైకాపా రంగులు వేయడంపై ఏప్రిల్ 29న సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాను. రెండు నెలల్లో ప్రభుత్వం దీనిపై ఒకసారి కూడా స్పందించలేదు. చివరకు నేడు ఆంబులెన్స్ ల కుంభకోణం బయటపడింది'' అని అన్నారు.  

''108 వాహనాల విషయంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని జీవోలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై వాస్తవాలను బయటపెట్టిన పట్టాభిరామ్ ఇంటికి పోలీసులను పంపారు. వాస్తవాలను బయటపెడితే పోలీసులను పంపి బెదరిస్తారా..? గతంలో బోండా ఉమామహేశ్వరావు ఇంటికి కూడా ఇదే విధంగా పోలీసులను పంపి బయపెట్టే ప్రయత్నం చేశారు. 1,060 ఆంబులెన్స్ లకు వైకాపా రంగులు వేసే అధికారం మీకెక్కడది..? మెయింటెనెన్స్ ఖర్చును రూ. లక్షా 31 వేలు నుంచి రూ. లక్షా 78 వేలకు ఏవిధంగా పెంచారు..? ప్రజల ప్రాణాలను కాపాడవలసిన ఆంబులెన్స్ లను మీ డబ్బా ప్రచారాల కోసం ఉపయోగించుకుంటారా..?'' అని ప్రశ్నించారు. 

read more  అచ్చెన్న, జెసి, యనమల, అయ్యన్న...వారి లిస్ట్ లో మొత్తం 33మంది: చంద్రబాబు

''ఆంబులెన్స్ ల కుయ్ కుయ్ అనే శబ్ధం రూ. 307 కోట్ల అవినీతి - అవినీతి అంటూ మారుమ్రోగిపోతోంది. ఈ అవినీతికి పాల్పడ్డ విజయసాయిరెడ్డి, ఆయన బంధువులపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ అవినీతికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి అనే అధికారిని డిప్యూటీ సీఈవోగా తీసుకొచ్చి నెల రోజుల్లోనే సీఈవోను చేశారు''  అని తెలిపారు. 

''సరస్వతి పవర్ కంపెనీపై అక్కడి రైతులు చేసిన పోరాటం రాష్ట్ర ప్రజల కళ్లలో నేటికీ మెదులుతోంది. కానీ కంపెనీ లీజును హుటాహుటిన 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచడమంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మీ బంధుగణానికి ఇచ్చిన రాయితీలన్నీ ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారని బెదిరిస్తారా..?'' అని అడిగారు. 

''కోర్టు ఎంటిసెపటరీ బెయిల్ ఇచ్చినా ఎంక్వైరీ పేరుతో బెదరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వివాహ వేడుకకు హాజరైన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప లపై అట్రాసిటీ కేసులు పెట్టారు.  38 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నపాత్రుడిపై అక్రమంగా నిర్భయ కేసు బనాయించారు. జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతిపై ఎర్రన్నాయుడు గారు కోర్టులో కేసులు వేశారని.. అచ్చెన్నాయుడు గారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని ఇష్టానుసారంగా రాష్ట్రం మొత్తం తిప్పడం వల్ల.. రెండోసారి ఆయనకు శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''అమరావతి శ్మశానం అని, అక్కడ పశువులు తిరుగుతునానయని నోటికొచ్చిన విమర్శలు చేసిన మంత్రులు నేడు చంద్రబాబు  కట్టిన 12 అంతస్తుల ఆకాశ హర్మ్యాలను తలెత్తి చూస్తున్నారు. కోర్టులు వెంటపడుతుండటంతో మంత్రులు చేస్తున్న అమరావతి పర్యటనను ప్రజలు విశ్వసించరు. 188 రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతోంది. 66 మంది రైతులు మనోవేధనతో చనిపోయారు. ఒక్క కుటుంబాన్ని అయినా మంత్రులు పరామర్శించారా..? కోర్టు ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వానికి అమరావతి రైతులు కనిపించడం లేదు.కౌలు డబ్బులు అందలేదని రైతులు కోర్టులో కేసులు వేస్తే తప్ప స్పందించలేదు'' అని విమర్శించారు. 

''మరోవైపు మండలిలో తెలుగుదేశం శాసనమండలి సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. అమరావతిపై తప్పు చేశామని మంత్రి బొత్స ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి'' అంటూ వైసిపి ప్రభుత్వం, నాయకులపై మాజీ మంత్రి దేవినేని విరుచుకుపడ్డారు.                              
   

click me!