ఏపీలో రూ.300 కోట్ల భారీ కుంభకోణం... సాక్ష్యాలివే: దేవినేని ఉమ

Arun Kumar P   | Asianet News
Published : Jun 22, 2020, 12:08 PM ISTUpdated : Jun 22, 2020, 12:18 PM IST
ఏపీలో రూ.300 కోట్ల భారీ కుంభకోణం... సాక్ష్యాలివే: దేవినేని ఉమ

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం 108 అంబులెన్సుల పేరిట మరో భారీ కుంబకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని  ఉమ ఆరోపించారు.

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం 108 అంబులెన్సుల పేరిట మరో భారీ కుంబకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని  ఉమ ఆరోపించారు. దాదాపు రూ.300 కోట్ల అవినీతి 108 అంబులెన్సుల వ్యవహారంలో  చోటుచేసుకుందంటూ సోషల్ మీడియా వేదికన  ఆయన ఆరోపించారు.  

''తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాద్యులయిన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏంచర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అంటూ ట్విట్టర్ వేదికన సీఎంను నిలదీశారు ఉమ.

అంతకుముందు ''లేటరైట్ గనులలో వందలకోట్ల దోపిడి అసలు లీజు దారులకు బెదిరింపులు. షాబాద్ లో అక్రమ మట్టిదోపిడీతో కొండచరియలు విరిగిపడి ముక్కలైన ప్రొక్లైన్,ఆపరేటర్ కు గాయాలు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు  మీపార్టీ నాయకుల దోపిడీ తాడేపల్లి రాజప్రసాదానికి కనపడుతుందా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అంటూ గనుల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతి గురించి ఉమ ట్వీట్ చేశారు. 

ఈ 108 అంబులెన్స్ ల వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన సూత్రధారి అని ఆయన ఆరోపించారు.ఈ కుంభకోణంపై సీఎం జగన్, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంబులెన్సుల నిర్వహణలో ఏ విధంగా అవినీతి జరిగిందో వివరించి... సాక్ష్యాధారాలతో తాము చెప్తున్నామని, వీటిపై సీఎం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

2016కి ముందు వరకూ జీవీకే ఈఎంఆర్‌ సంస్థ అంబులెన్సులను నిర్వహించేది. 2011 అక్టోబరు 1 నుంచి 2016 సెప్టెంబరు 30 వరకూ ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒప్పందం జరిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం విషయంలో ఏ మాత్రమూ జోక్యం చేసుకోకుండా జీవీకే నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించామని పట్టాభి తెలిపారు. 

2016లో ఓపెన్‌ టెండర్లు పిలవడం ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతోపాటు లండన్‌కు చెందిన యూకే ఎస్‌ఏఎస్‌ భాగస్వామ్యం కలిగిన బీవీజీ కంపెనీ టెండర్లు దక్కించుకుందన్నారు.. నియమ నిబంధనలకు అనుగుణంగా 2017 డిసెంబరు 13న ఐదేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పొందిందని ఆయన గుర్తుచేశారు.

ఈ కాంట్రాక్టు 2020 డిసెంబరు 12 వరకూ ఉంటుంది. అయితే.. మధ్యలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రావడంతోనే 2019 సెప్టెంబరు 5న ఉన్న అంబులెన్సులకు అదనంగా మొత్తంగా 439 అంబులెన్సులు కొనుగోలు చేసేందుకు 105 జీవో ఇచ్చిందని ఆయన చెప్పారు. 

 రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా ఉండేందుకు ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు అందులో పేర్కొంది. అంతేకాదు 2019 సెప్టెంబరు 20న పాత, కొత్త అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీని గుర్తించాలని 111 జీవో విడుదల చేసింది. బీవీజీ సంస్థ కాంట్రాక్టు పరిమితి ముగియక ముందే కొత్త సంస్థను గుర్తించాల్సిన అవసరం ఏమిటో ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం చెప్పాలని పట్టాభిరాం డిమాండ్‌ చేశారు.

read more  ఏపీ ఈఎస్ఐ స్కాం: కోదాడలో ఏ-3 ప్యామిలీని విచారించిన ఏసీబీ

మొదటి నుంచీ ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్సుల సర్వీసులను ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు కింద నిర్వహించేలా 2019 అక్టోబరు 30న జీవో 566ను ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవో అనే వ్యక్తిని ఆఘమేఘాలపై డైరెక్టర్‌గా నియమించింది. ఈ మార్పు ఎందుకు చేశారని పట్టాభిరాం ప్రశ్నించారు.

 ఈ అంబులెన్సులను కొనుగోలు చేయడం కోసం రూ.71.48 కోట్లు విడుదల చేస్తున్నట్లు 2019 డిసెంబరు 30న జీవో 679 ఇచ్చారని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవోగా నియమించిన రాజశేఖరరెడ్డికి నెల రోజులకే అడిషనల్‌ సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ ఆరోగ్యశ్రీ నిర్వహణ మొత్తం అతని చేతుల్లో పెడుతూ జీవో 72 ఇచ్చారని పట్టాభిరాం వివరించారు. 

2019 అక్టోబరు 18న అంబులెన్సులను ఫైనాన్స్‌ విధానంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేలా జీవో 117ను ప్రభుత్వం జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండకూడదంటూ ‘ఫైనాన్స్‌’ అన్న ప్రభుత్వ పెద్దలు... డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి కారణమేంటి? అని పట్టాభిరాం ప్రశ్నించారు. ఎవరితో ఎంత కమీషన్‌ కోసం ఈ జీవో మార్పు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అమలులో ఉండగానే దానిని రద్దు చేసి కొత్త అంబులెన్సులకు నెలకు రూ.1.78 లక్షలు, పాత అంబులెన్సులకు రూ.2.21 లక్షలు చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లించేలా 2020 ఫిబ్రవరి 13న జీవో 116 విడుదల చేసినట్లు పట్టాభిరాం తెలిపారు. 

కానీ, బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్సుకు రూ.1.31 లక్షలకే నిర్వహిస్తుంటే ఆ సంస్థను కాదని అరబిందో ఫౌండేషన్‌ సంస్థకు ఎందుకు ఇవ్వా ల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ఆత్మ అయిన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌కు చెందిన అరబిందో ఫౌండేషన్‌కు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా 108 అంబులెన్సుల నిర్వహణలోనే రూ.307 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇది కేవలం 108 వా హనాల్లో మాత్రమేనని, 104 వాహనాల్లో మరెంత కుట్ర జరిగిందో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేసి సొంత కంపెనీకి కట్టబెట్టడంలో విజయసాయిరెడ్డి పాత్ర లేదంటారా అని ప్రశ్నించారు. తాను లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu