దక్షిణాదిలో కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్తలు తీసుకోవడంపైనే థర్డ్ వేవ్ తీవ్రత: గులేరియా

By Siva KodatiFirst Published Aug 14, 2021, 6:18 PM IST
Highlights

ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసుల కట్టడి ఇప్పుడు బాగుందని గులేరియా ప్రశంసించారు.

దేశంలో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించడంపైనే థర్డ్ వేవ్‌ ఆధారపడి ఉంటుందన్నారు ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ 41వ వ్యవస్థాపక దినోత్సవంలో గులేరియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గులేరియాకు గీతం విద్యా సంస్థల ఛైర్మన్‌ శ్రీభరత్‌ గీతం ఫౌండేషన్‌ డే అవార్డును అందించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మూడో దశ పిల్లలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందన్న దానికి సరైన అధ్యయనం లేదని అన్నారు. వాళ్లకు వ్యాక్సినేషన్‌ కాలేదు కాబట్టి ఎక్కువగా వైరస్‌ బారిన పడేవాళ్లలో వీరు అధికంగా ఉంటారని అంచనా వేస్తున్నారని గులేరియా పేర్కొన్నారు. 

ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో తాజాగా కేసులు పెరుగుతున్నాయని, కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని ఎయిమ్స్ చీఫ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసుల కట్టడి ఇప్పుడు బాగుందని చెప్పిన ఆయన, హఠాత్తుగా ఒక ప్రాంతంలో కేసుల విజృంభణ జరిగితే వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాల్లో కేసులు వ్యాపించకుండా ఉంటాయని సూచించారు.

ALso Read:తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. 53 కోట్లు దాటిన టీకాల పంపిణి...

కరోనా వైరస్‌పై ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని, వైరస్‌ కూడా వేరు విధాలుగా రూపాంతరం చెంది వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉందని గులేరియా చెప్పారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. వ్యాక్సిన్‌ ప్రభావం నుంచి వైరస్‌ తప్పించుకోగలిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని గులేరియా వివరించారు. 

click me!