bhakarapet bus accident: రుయాలో మహిళ మృతి.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

By Siva KodatiFirst Published Mar 27, 2022, 9:48 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నాగలక్ష్మీ అనే మహిళ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. 

చిత్తూరు జిల్లాలో (chittoor bus accident) జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన నాగలక్ష్మీ అనే మహిళ తిరుపతి రుయా ఆసుపత్రిలో (tirupati ruia hospital) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో కూరుకుపోయారు. 

కాగా.. చిత్తూరు జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డు (bhakarapet bus accident) వద్ద శనివారం రాత్రి బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. ఇందుకోసం వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఓ ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు బయలుదేరారు. 

అయి వీరు ప్రయాణిస్తున్న బస్సు చిత్తూరు జిల్లాలో భాకరావుపేట ఘాట్ రోడ్డుపై వెళుతుండగా దొనకోటి గంగమ్మ దేవాలయం సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది.  ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. 

ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి కుమారుడు సహా బస్సులో 52 మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందగా... రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు, నారావారిపల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందారు. పెళ్లి కుమారుడు వేణుతో సహా 44 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయా ఆస్పత్రిలో 31 మంది బాధితులు, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్ ఆస్పత్రిలో మరో ఆరుగురికి చికిత్స  పొందుతున్నారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 

అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌ ఎం.బసిరెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్‌లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. ఇక, ఈ ప్రమాదంలో మృతులను మలిశెట్టి వెంగప్ప, గణేష్‌, కాంతమ్మ, మురళీ, యశస్విని, ఆదినారాయణ, రసూల్‌(డ్రైవర్‌), క్లీనర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), ఏపీ సీఎం వైఎస్ జగన్‌లు (ys jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున మృతుల కుటుంబాకు రూ.2 లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రకటించారు. 

click me!