
విశాఖపట్నం: వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కట్టుకున్న భార్యకు నరకం చూపిస్తున్నాడు. వివాహేతర సంబంధం వద్దని నిలదీసిన పాపానికి చచ్చేదాక దాడి చేయడం. సహజీవనం చేయోద్దంటూ అడ్డుతగులుతుండటంతో ఏకంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చి కట్టుకున్న భార్యను మరింత క్షోభకు గురిచేశాడు ఓ ప్రబుద్ధుడు.
సహజీవనం చేస్తున్న మహిళను ఇంట్లోకి తెచ్చి భార్యపై దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుమార్తె తండ్రిని వారించింది. ఇంట్లో నుంచి ఆమెను పంపించెయ్యాలంటూ వేడుకుంది.
దీంతో కోపోద్రిక్తుడైన ఆ తండ్రి మళ్లీ భార్యపై చెయ్యి చేసుకోవడంతో కుమార్తె తట్టుకోలేకపోయింది. క్షణికావేశంలో పక్కనే ఉన్న చాకుతో తండ్రిపై దాడి చేసి హతమార్చింది. అంతేకాదు తన తండ్రితో సహజీవనం చేస్తున్న మహిళపైనా దాడికి దిగింది. ఆమె పారిపోవడంతో ప్రాణాలు దక్కించుకుంది.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో చోటు చేసుకుంది. స్థానిక రవీంద్రనగర్ లో రైల్వే ఉద్యోగి కోడ సముద్రయ్య(48) కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు దగ్గర్లోనే భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
అంతటితో ఆగకుండా ఆమెను నేరుగా ఇంటికి తీసుకువచ్చేశాడు. దీంతో కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి ఇదే అంశంపై భార్య నాగలక్ష్మి భర్తను నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. వివాదం కాస్త ఘర్షణకు దారి తియ్యడంతో సముద్రయ్య భార్యపై దాడికి పాల్పడ్డాడు.
అడ్డువచ్చిన కుమార్తె బిబాషాపై కూడా దాడి చేశారు. తండ్రి ప్రవర్తనతో విసుగుపోయిన బిబిషా క్షణికావేశంలో చాకుతో తండ్రిపై దాడికి దిగింది. తీవ్ర గాయాలపాలైన సముద్రయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటు తండ్రితో సహజీనం చేస్తున్న మహిళపైనా దాడికి పాల్పడింది.
తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. నిందితులు బిబిషా, నాగలక్ష్మిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.