కుళాయి వద్ద కొట్లాట: బాలింత దుర్మరణం

By Nagaraju penumalaFirst Published May 10, 2019, 8:03 AM IST
Highlights

తల్లిపై దాడిని ఆపేందుకు మౌలాబీ అడ్డు వచ్చింది. ఆమెపై కూడా దాడి చేసి వెనక్కి తోసేశారు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

కర్నూలు: కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. కుళాయి దగ్గర ఏర్పడిన ఘర్షణ ఒక గర్భిణీని బలితీసుకుంది. కర్నూల్ టౌన్ లోని లక్ష్మీనగర్ లో తాగు నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వ కుళాయిల నుంచి వచ్చే నీటిని వంతుల వారీగా కాలనీ వాసులు పట్టుకుంటారు. 

అందులో భాగంగా నీరు పట్టుకునేందుకు షేక్షావలి, షేకున్ బీ దంపతుల కుమార్తె  మౌలాబీ కులాయి వద్దకు వెళ్లింది. అయితే కుళాయి దగ్గర నీరు పట్టుకునే విషయంలో పక్క గుడిసెలో ఉంటున్న రామచంద్రమ్మతో గొడవ ఏర్పడింది. 

గొడవ కాస్త పెద్దది కావడంతో తోటి మహిళలు సర్ధిచెప్పారు. అయితే పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు షేక్షావలి, షేకున్ బీ లకు గొడవ విషయం చెప్పింది మౌలాబీ. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు రామచంద్రమ్మతో గొడవకు దిగారు. ఆగ్రహం చెందిన రామచంద్రమ్మ  కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షేకున్ బీపై దాడికి దిగారు. 

దాడితో షేకున్ బీ కుప్పకూలిపోయింది. తల్లిపై దాడిని ఆపేందుకు మౌలాబీ అడ్డు వచ్చింది. ఆమెపై కూడా దాడి చేసి వెనక్కి తోసేశారు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఇకపోతే మౌలాబీకి ఐదేళ్ల క్రితం వివాహమైంది. గర్భం దాల్చడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. రెండు నెలల క్రితం అమ్మాయికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె బాలింత. రెండు నెలల పసికందును చూసి అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాప పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. ఇకపోతే మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు రామచంద్రమ్మ, భర్త రత్నమయ్య, కుమార్తె మనీషాలపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  

click me!