అత్తను అతికిరాతకంగా చంపిన కోడలు.. తలపై కర్రతో కొట్టి, గొంతుపిసికి, చీరతో ఉరి బిగించి హత్య...

By Bukka SumabalaFirst Published Aug 5, 2022, 11:42 AM IST
Highlights

అత్తా కోడళ్ల గొడవలు మామూలే కానీ.. ఓ కోడలు దీనికి చాలా దారుణమైన పరిష్కారాన్ని ఎంచుకుంది. అత్తను అతి కిరాతకంగా హతమార్చి అడ్డు తొలగించుకుంది. 

కృష్ణాజిల్లా : కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త పై కక్ష పెట్టుకొన్న కోడలు ఆమెను కిరాతకంగా హత్య చేసింది. ఆపై దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బహిర్గతం కావడంతో కోడలు జైలు పాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ పెడన పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు. పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మ వివాహం జరిగి దాదాపు పన్నెండేళ్లు అయ్యింది. పెళ్లైన నాటి నుంచి అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. దీంతో అత్త రజనీ కుమారిపై.. కోడలు కొండాలమ్మ కక్ష పెట్టుకుంది. 

ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకుంది. సమయం కోసం ఎదురుచూసింది. గత నెల 27వ తేదీన ఇంట్లో ఎవరూ లేని టైంలో.. ఓ కర్ర తీసుకుని అత్త రజనీకుమారి తలమీద విచక్షణా రహితంగా బలంగా కొట్టింది. ఆ తరువాత పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. ఇంత చేసినా ఆమె చనిపోకపోవడంతో మెడకు చీరతో ఉరి బిగించింది. దీంతో అత్త నోరు, ముక్కుల్లో నుంచి రక్తం రావడంతో స్పృహ కోల్పోయింది. అత్తగారు చనిపోయిందని భావించిన కోడలు తన భర్తకు బంధువులకు సమాచారం అందించింది.

భార్యపై అనుమానం.. గొంతు పిసికి చంపి, కాలువలో విసిరేసి...మిస్సింగ్ డ్రామా...

ప్రమాదం  జరిగిందని…
తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొండాలమ్మ.. అత్త కాలుజారి వరండాలో పడిపోయిందని.. దీంతో తీవ్రంగా గాయపడినట్లు భర్తకు, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చిన కుమారుడు వీరబాబు, కూతురు  తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. అయితే, అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 30వ తేదీన రజనీ కుమారి మరణించింది. ఈ క్రమంలో మృతురాలి కుమారుడు వీరబాబు తన తల్లి ఇంట్లో ప్రమాదవశాత్తు పడడంతో తీవ్ర గాయాలైనట్లు పోలీసులతో పేర్కొన్నాడు. దీంతో మొదట పోలీసులు అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేసుకున్నారు.

మేం కుట్రలు చేసేంత సీన్ మాధవ్‌కి లేదు.. ఫోరెన్సిక్ పరీక్షల్లోనే తేలుతుంది : చింతకాయల విజయ్

పోస్టుమార్టం రిపోర్ట్ తో వెలుగులోకి…
విజయవాడ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ తో కోడలు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.  మృతురాలి తలకు బలమైన దెబ్బ తగలడం.. ఆ తర్వాత ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయినట్లు నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అనుమానించిన పోలీసులు  గ్రామంలో విచారించారు. అక్కడ వారికి అందిన సమాచారంతో కోడలు కొండాలమ్మను తమదైన శైలిలో విచారించారు. దీంతో కొండాలమ్మ అత్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది. అత్తని చంపడానికి ఉపయోగించిన చీరను కూడా స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. దీంతో కేసును హత్యకేసుగా మార్చి నిందితురాలు కొండాలమ్మను కోర్టులో హాజరు పరిచాం అని పేర్కొన్నారు.

click me!