
ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకుంటున్న సమయంలో సినీ ప్రముఖుడు, కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావు హఠాన్మరణం వైసీపీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే, వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి, దాసరి మధ్య ఇద్దరి భేటీ జరిగింది. దాసరి వైసీపీలో చేరనున్నట్లు భేటీ తర్వాత ప్రచారం జరిగింది. తర్వాత కూడా ఇద్దరూ ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యారు కూడా.
పోయిన ఎన్నకల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వైసీపీకి బాగా దెబ్బపడింది. పశ్చిమగోదావరి జిల్లాలో అయితే 15 సీట్లకు గాను ఒక్కసీటు కూడా రాలేదు. కారణం పవన్ కల్యాణ్. కోస్తా జిల్లాల్లో ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం బలమెక్కువ.
పవన్-దాసరి ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే. అయితే, పోయిన ఎన్నికల్లో పవన్ టిడిపి-భాజపాలకు మద్దతుగా నిలబడటంతో ఉభయగోదావరి జిల్లాలోని అత్యధిక స్ధానాలు టిడిపి-భాజపా వశమయ్యాయి.
కాపు సామాజికవర్గానికి చేరువవటంలో భాగంగానే జగన్, దాసరిని కలిసారన్నది వాస్తవం. సామాజికవర్గంలో దాసరికి కూడా చెప్పుకోతగ్గ బలముంది. అందుకనే జగన్, దాసరిని కలిసారు. దాసరి వైసీపీకి మద్దతు ఇవ్వటానికి అంగీకరించారు.
అవసరమైనపుడు రాష్ట్రంలో తిరిగి పార్టీకి ప్రచారం చేస్తానని దాసరి మాట కూడా ఇచ్చారని వైసీపీ నేతలు అప్పట్లో చెప్పారు. అయితే, హటాత్తుగా దాసరి అనారోగ్యంబారిన పడ్డారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నపుడు కూడా జగన్, దాసరిని పలుమార్లు పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడుతోందనుకుంటున్న సమయంలో హటాత్తుగా దాసరి మరణించటం జగన్ కు నిజంగా షాకే.