
తెలుగుదేశంపార్టీ సీనియర్లలో ఒకరైన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రాభవానికి గండిపడినట్లే. రాజుగారి 30 ఏళ్ళ ఏకఛత్రాధిపత్యానికి తెరపడినట్లే. జిల్లా అధ్యక్షపదవి ఎంపిక, పార్టీలో చేరికలు, పదవులకు ఎంపిక తదితరాల విషయంలో స్పష్టంగా కనబడుతోంది.
చంద్రబాబునాయుడుకు, గజపతిరాజుకు మధ్య ఇటీవల బాగా ఎడం పెరిగిందన్నది వాస్తవం. దాని ఫలితమే అశోక్ మాట చెల్లుబాటు కాకపోవటం. ఒకపుడు విజయనగరం జిల్లాకు సంబంధించి ఏ నిర్ణయమైనా అశోక్ మాటే ఫైనల్. అటువంటిది ఇపుడు జిల్లాకు సంబంధించిన ఏ విషయంలోనూ చంద్రబాబు కేంద్రమంత్రిని సంప్రదించటం లేదట. సంప్రదించటం మాట అటుంచి పూర్తి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నిన్నటి వరకూ రాజుగారికి గట్టి మద్దతుదారుగా ఉన్న జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ను పక్కన బెట్టేసినట్లే. ఆయన స్ధానంలో గజపతినగరం ఎంఎల్ఏ కెఎ నాయుడు, కొండబాబు, పూసపాటిరేగ ఎంపిపి మహంతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
అలాగే, శత్రుచర్ల విజయకుమార్రాజుకు ఎంఎల్సీ ఇవ్వటాన్ని అశోక్ వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు వినలేదు. అదేవిధంగా, వైసీపీ ఎంఎల్ఏ సుజయకృష్ణరంగరావును పార్టీలో చేర్చుకోవటాన్నీ అశోక్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఖాతరు చేయకపోగా ఏకంగా మంత్రిపదవినీ కట్టబెట్టారు.
ఇలా ఏరకంగా చూసినా అశోక్ గజపతిరాజుకు పార్టీలో చుక్కెదురౌతోంది. మొన్నటి మహానాడులో కూడా అందుకే అశోక్ పెద్దగా కనబడలేదు. అంటే అశోక్ కేంద్రమంత్రిగా ఉండటం కూడా బహుశా చంద్రబాబు ఇపుడు ఇష్టపడటంలేదేమో. కానీ తప్పించే సాహసం చేయకపోవచ్చు.
ఎందుకంటే, అశోక్ కేంద్రమంత్రవ్వటానికి కారణం మోడినే. రాజుగారి రాజకీయ నేపధ్యం చూసిన తర్వాత స్వయంగా మోడినే అశోక్ ను మంత్రివర్గంలో చేర్చుకున్నారు కాబట్టి రాజుగారిని మంత్రిపదవిలో నుండి తప్పించే సాహసం చంద్రబాబు చేయకపోవచ్చు.