ఏపీలో దళితులపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా ఆగస్ట్ 10న విజయవాడ జింఖానా మైదానంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ప్రతిఘటన ర్యాలీ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి జవహర్ ప్రకటించారు.
గుంటూరు: నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే బేడీలు, అడ్డుకుంటే అవమానాలు అనేలా రాష్ట్రంలోని దళితుల పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై కక్షగట్టి దమనకాండ సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ మెడలు వంచి... దళితులకు న్యాయం చేసేందుకు ఆగస్టు 10న దళిత ప్రతిఘటన ర్యాలీకి శ్రీకారం చుట్టినట్లు మాజీ మంత్రి ప్రకటించారు.
''విజయవాడ జింఖానా మైదానంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ప్రతిఘటన ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. దళితుల హక్కుల సాధనకు ఉద్యమించాలి. దళితుల అభ్యున్నతిని నాశనం చేస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెబుదాం'' అని పిలుపునిచ్చారు.
''దళితుల విషయంలో కేవలం ప్రచారాలు మాత్రమే చేసుకుంటూ... అభివృద్ధిని బూటకం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు అండగా నిలిస్తే... నేడు అణగదొక్కుతున్నారు. దళితులు ఎదగకూడదు, స్వయం సమృద్ధి సాధించకూడదు అనేలా వ్యవహరిస్తున్నారు. మీ పిల్లలు మాత్రమే విదేశాల్లో చదువుకోవాలా.? మా దళిత బిడ్డలు విదేశాల్లో ఉన్నత చదువులు చదవకూడదా.? ఇదేనా దళిత అభ్యున్నతి.? ఇదేనా దళిత సంక్షేమం.?'' అని నిలదీశారు.
read more కోర్టు దిక్కరణ... హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ లపై న్యాయమూర్తి సీరియస్
''ఎస్సీ నియోజకవర్గంలో చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని నాశనం చేశారు. రాజధానిని ఎస్సీ నియోజకవర్గంలో ఉంచాలన్నందుకు ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పేరుతో బేడీలు వేశారు. పులివెందులలో దళిత మహిళపై అత్యాచారం చేసి చంపేస్తే.. న్యాయం చేయాన్న టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధించారు'' అని తెలిపారు.
''దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణను పట్టపగలు, నడిరోడ్డుపై దాడి చేసి జైల్లో పెట్టారు. జడ్జి శ్రావణ్‌కుమార్‌పై అక్రమ కేసులు పెట్టారు. మాజీ దళిత సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ ను అవమానించి గెంటేశారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, చీరాలలో కిరణ్, పుంగనూరులో ఓం ప్రతాప్, గురజాలలో విక్రం వంటి ఎంతో మంది దళితులపై దాడులకు పాల్పడి, ఊపిరి తీసిన జగన్ రెడ్డి రౌడీ మూకల దాష్టీకాలను ఎదురొడ్డుదాం. దళిత స్వామ్యాన్ని, స్వాభిమానాన్ని కాపాడుకుందాం'' అని మాజీ మంత్రి జవహర్ దళిత సమాజానికి పిలుపునిచ్చారు.