అర్థరాత్రి తీరం దాటిన నివర్... ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త: విపత్తుల శాఖ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Nov 26, 2020, 7:21 AM IST
Highlights

తమిళనాడు - పుదుచ్చేరి మధ్య బుధవారం రాత్రి నివర్ తుఫాను తీరం దాటింది, 

హైదరాబాద్: నివర్ తుఫాను తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ తెలిపింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం ఇది దాటినట్లు ప్రకటించారు. అతి తీవ్ర తుపాను తీరంవైపు దూసుకొచ్చిన ఇది కాస్త బలహీన పడి తీరం దాటింది. 

తీరందాటిన నివర్ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాం తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఇవాళ చిత్తూరు , కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 

తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్  కె.కన్నబాబు సూచించారు.

read more   అర్థరాత్రి తీరం దాటనున్న నివర్: జగనన్న అమూల్ ప్రాజెక్టు తొలి దశ వాయిదా

ఇక ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఇక ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 25, 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

నెల్లూరు జిల్లాపై ఈ తుఫాను ప్రభావం అధికంగా వుండనుందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హుటాహుటిన బయలుదేరాడు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,  నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తదితరులతో మాట్లాడుతూ తుఫానును ఎదుర్కోడానికి చేపట్టిన చర్యలపై చర్చించి పలు సూచనలు అందించారు మంత్రి అనిల్. 

 

click me!