Cyclone Michaung: చెన్నై పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు డజను మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో చిక్కుకున్న అనేక మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను విరుచుకుపడుతోంది. దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే డజన్ల మంది ప్రాణాలు తీసుకున్న ఈ సైక్లోన్.. భారీగా ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది. చెన్నై నగరాన్ని కకావికలం చేసింది. తమిళనాడులోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా మారాయి. తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ మొదలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు పేర్కొన్నాయి. రానున్న గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన మిచౌంగ్ తుఫాను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బాపట్ల తీరంలో తీరం దాటడం ప్రారంభించిందని ఐఎండీ వర్గాలు తెలిపాయి. ఫలితంగా అలలు పెరిగి సముద్ర వాతావరణం ఒక్కసారిగా మారి బాపట్ల పరిసర ప్రాంతాల్లో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో భారీ వర్షం బాపట్ల ప్రాంతాల్లో విరుచుకుపడుతోంది.
తీరం దాటిన తర్వాత తుఫాను బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒంగోలుకు తూర్పు ఈశాన్యంగా 20 కిలోమీటర్లు, బాపట్లకు నైరుతి దిశగా 45 కిలోమీటర్లు, కావలికి ఈశాన్యంగా 80 కిలోమీటర్లు, నెల్లూరుకు ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, మచిలీపట్నానికి నైరుతి దిశగా 110 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.30 గంటలకు కేంద్రీకృతమైన మిచౌంగ్ తుఫాను నెమ్మదిగా బాపట్ల తీరం వైపు కదిలింది. గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలిందని ఐఎండీ మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.