
ఇప్పటికే భారీ వర్షాలు (Heavy rains), వరదలతో సతమతవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు ఇది మరో పిడుగులాంటి వార్త. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణ నష్టంతో పాటుగా, భారీగా ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు తుఫాన్ (Cyclone) దూసుకోస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ థాయ్‌లాండ్, ఆ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సముద్రం నుంచి పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి.. దానికి అనుకుని ఉన్న బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకోస్తుందని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇది నెల్లూరు తీరానికి 1,400 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. ఇది డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండగా, 3వ తేదీకి తుపానుగా బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్‌గా మారితే దీనికి జవాద్‌గా (Cyclone Jawad) నామకరణం చేయనున్నారు.
Also read: ప్రకాశం జిల్లా.. మోపాడు రిజర్వాయర్ కు లీకులు.. 5 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు..
డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి ఇది ఉత్తరాంధ్ర- ఒడిశా తీరాలకు చేరుకుని మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర (North Coastal Andhra pradesh), దక్షిణ ఒడిశా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే డిసెంబర్ 2 నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో.. డిసెంబర్ 2వ తేదీ నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
అయితే దక్షిణ కోస్తాంధ్రపై తుపాన్ పెద్దగా ప్రభావం చూపకవచ్చని అధికారులు చెప్పారు. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు.