Cyclone Gulab: భారీ వర్షంతో ప్రమాదం... విశాఖలో రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

By Arun Kumar PFirst Published Sep 28, 2021, 1:58 PM IST
Highlights

గులాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో విశాఖపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వెంటనే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ సైక్లోన్ తీరం దాటిన ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారమే తుఫాను తీరం దాటి బలహీనపడ్డా భారీ వర్షాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి. రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతుండటంతో విశాఖ జిల్లాలో ప్రమాదాలు సంబవిస్తున్నాయి. 

విశాఖ నగర పరిధిలోని తెన్నేటి పార్క్ వద్ద కొండ చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అయితే ఈ సమయంలో కోడ్డుపై వాహనాలేవీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది బండ రాళ్లను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూశారు.  

విశాఖలో సోమవారం 24 గంటల్లో 282 మిల్లీ మీటర్ల భారీ వర్షం నమోదయ్యింది. సెప్టెంబర్ నెలలో ఈ స్థాయిలో వర్షం కురిసి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఈ మధ్యలో ఈ స్థాయిలో వర్షం ఎప్పుడూ కురవలేదు.  మంగళవారం కూడా ఇదే రీతిలో వర్షం నమోదవుతోంది. 16 ఏళ్ల క్రితం 2005 లో ప్యార్ తుఫాన్ వల్ల భారీ వర్షపాతం నమోదవగా ఆ రికార్డును ఇప్పటి వర్షాలు బద్దలుకొట్టాయి. 

మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారి వాగులు వంకలు పొంగిపొర్లి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.  

వీడియో Cyclone Gulab:వరదనీటితో చెరువును తలపిస్తున్న వైజాగ్ విమానాశ్రయం  

విశాఖ నగరంలో మళ్లీ ఇవాళ భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. జిల్లా కలెక్టరేట్‌, కేజీహెచ్‌, రైల్వేస్టేషన్‌, మద్దిలపాలెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగర వ్యాప్తంగా 80 కాలనీలు నీట మునిగినట్లు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. సుమారు 60 కాలనీల్లోని వరదనీటిని తోడించే చర్యలు పూర్తి చేశామని.. మరో 20 కాలనీల్లో ఆ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
 
జిల్లా వ్యాప్తంగా 11 సబ్‌స్టేషన్లలోకి వరదనీరు చేరిందన్నారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని... ఇదే క్రమంలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు.

click me!