Cyclone Gulab Effect : తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వాన..

By AN TeluguFirst Published Sep 27, 2021, 10:30 AM IST
Highlights

విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో విషాదం చోటుచేసుకుంది ఇంటిపై కొండచరియలు విరిగి పడటంతో ఓ మహిళ మృతి చెందింది.  పెందుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది. ఈదురుగాలులకు అక్కిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రెండు తాటి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలకు దుర్గానగర్ నాయుడు తోట ప్రాంతాలు నీటమునిగాయి. 

గులాబ్ తుఫాన్ (Cyclone Gulab) తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. నిన్నటినుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ(Telangana)లోనూ వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. పలు ప్రాంతాలు నీటమునగగా.. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల కారణంగా సోమవారం జరగాల్సిన పలు  పరీక్షలు(Exams)వాయిదా పడ్డాయి. 

విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో విషాదం చోటుచేసుకుంది ఇంటిపై కొండచరియలు విరిగి పడటంతో ఓ మహిళ మృతి చెందింది.  పెందుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది. ఈదురుగాలులకు అక్కిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రెండు తాటి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలకు దుర్గానగర్ నాయుడు తోట ప్రాంతాలు నీటమునిగాయి. 

రానున్న ఆరు గంటల్లో తుఫాను బలహీనపడుతుందని విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు తెలిపారు.  తుఫాన్ తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని  ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్  కన్నబాబు తెలిపారు.  దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని... చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.  ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.  ఉత్తరాంధ్రలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు  వీస్తాయన్నారు.  సముద్రం అలజడిగా ఉంటుందని..  మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.  ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని  కన్నబాబు కోరారు.

Cyclone Gulab : ఏపీలో ఇద్దరు మత్స్యకారులు మృతి, ఒకరు గల్లంతు..

విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.  భారీ వర్షానికి ప్రధాన రహదారులు  సహా కాలనీలన్నీ జలమయమయ్యాయి.  లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.  డ్రైనేజీలు ఉప్పొంగడంతో  మోకాలు లోతు వర్షపు నీరు నిలిచి స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విద్యుత్ శాఖ అధికారులు,  సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలని  టీఎస్  ఎన్ పిడిసిఎల్ సిఎండీ  అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు.  ప్రజలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.  విద్యుత్ వైర్లు తెగిన,  దానికి సంబంధించిన ఇతర సమస్యలపై సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూమ్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.  కంట్రోల్ రూమ్ నెంబర్  18004250028,  టోల్ ఫ్రీ నెంబర్  1912.

 గులాబ్ తుఫాన్ కారణంగా జేఎన్టీయూ పరిధిలో నేడు జరగాల్సిన  బీటెక్,  బి ఫార్మసీ పరీక్షలు వాయిదా పడ్డాయి.  వర్షాల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ వెల్లడించారు. వాయిదాపడిన పరీక్షల షెడ్యూల్ను తర్వాత ఖరారు చేస్తామని పేర్కొన్నారు.  రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.  హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,  మెరుపులతో కూడిన వర్షం పడింది.  జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్,  కూకట్పల్లి,  అంబర్ పేట, కాచిగూడ,  గోల్నాక,  నల్లకుంట, ఉప్పల్, రామంతపూర్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్  ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Cyclone Gulab: తప్పిన ముప్పు... తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుఫాను

 తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.  రామకృష్ణ రావు పేట లో  ఇళ్లలోకి  వర్షపు నీరు చేరింది.  సాంబమూర్తి నగర్,  పల్లంరాజుపేట,  రేచర్ల పేట, దుమ్ములపేట  తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది.  మరోవైపు  కోనసీమలోనూ  వర్షాలు  జోరుగా కురుస్తున్నాయి. అమలాపురం,  అంబాజీపేట,  పి గన్నవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతుంది.  అమలాపురంలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  రాజమహేంద్రవరం, రంపచోడవరం, పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది.

తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. చోడవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాలాజీ నగర్ లో ఇళ్లలోకి నీరు చేరింది.  ద్వారకా నగర్ లో  రెండు తాటాకు ఇల్లు నేలమట్టమయ్యాయి.  ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.  ముంచంగిపుట్టు మండలంలో  కురిసిన భారీ వర్షానికి  మత్స్య గెడ్డ పొంగిపొర్లుతోంది.  అనకాపల్లి మండలం రాజుపాలెం వద్ద ఉప్పుగెడ్డ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.విశాఖ నగరంలోని జ్ఞానాపురం రైల్వే ప్రవేశద్వారం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రవేశ ద్వారం నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు ముంపు ఏర్పడింది.

గులాబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.  అత్యధికంగా గజపతినగరంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. పూసపాటిరేగ లో  19 సెంటీమీటర్లు,  నెల్లిమర్ల లో 14 సెంటీమీటర్లు,  గరివిడి లో 12 సెంటీ మీటర్లు,  కొత్తవలస లో 11 సెంటీమీటర్లు,  సాలూరులో 10 సెంటీమీటర్లు  వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. 
 

click me!