Cyclone Gulab: తప్పిన ముప్పు... తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుఫాను

By Arun Kumar P  |  First Published Sep 27, 2021, 9:40 AM IST

గులాబ్ సైక్లోన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని...మరో 6 గంటల్లో ఇది వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు గులాబ్ తుఫాను (Gulab Cyclone) గండం తప్పింది. ప్రమాదకరంగా తీరంవైపు దూసుకువచ్చిన ఈ తుపాను ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్‌ మధ్య తీరం దాటింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తీరాన్ని తాకిన తుపాన్‌ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనిస్తోంది. 

అయితే గులాబ్ తుఫాను తీవ్రత తగ్గి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.  రాగల 6 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను వాయుగుండంగా మారినా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఏపీ, తెలంగాణలో భారీనుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Latest Videos

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని... సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. చాలచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు...  ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 

ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40- 60కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రం అలజడిగా‌ ఉంటుందని... మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల శాఖ కమీషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు.  

పశ్చిమ గోదావరి జిల్లాలో గులాబ్ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.  

శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య గులాబ్ తుపాను తీరం దాటిందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో ఎక్కువ నష్టం జరగలేదని... అయితే నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. 

''అన్ని శాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి. 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశాం. 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్‌కు తెలపాలని... కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557, జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933'' అని కలెక్టర్ తెలిపారు. 

ఇక గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లు పాక్షికంగా రద్దు, పలు రైళ్లు దారి మళ్లించగా మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఇవాళ్టి తిరుపతి - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ - పూరి ఎక్స్‌ప్రెస్,  హెచ్.ఎస్. నాందేడ్- సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్,కేఎస్ఆర్ బెంగళూరు- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దయ్యాయి. 

click me!