Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... కొట్టుకుపోతున్న వంతెనలు, విరిగిపడుతున్న చెట్లు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 27, 2021, 11:37 AM IST
Highlights

గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదాలు సంబవిస్తున్నాయి. వరదనీటి ఉద్రుతికి వంతెనలు కూలిపోవడం, ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం జరుగుతోంది. 

అమరావతి: గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డా రాష్ట్రంలో భారీ వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పటికే జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారిపోయాయి. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, పాలకొల్లు, నరసాపురం,జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాల్లో ఎడతెరిని లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం వద్ద జల్లేరు వాగు వరదనీటితో పోటెత్తింది. దీంతో ఇటీవలే రూ.60 లక్షలతో నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోయి పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

 వీడియో

ఇక కృష్ణాజిల్లాలో కూడా తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. అయితే గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో కైకలూరు మండలం ఆటపాక వద్ద జాతీయ రహదారిపై చెట్టు  విరిగిపడింది. దీంతో కైకలూరు - ఆకివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాపిక్ జాం ఏర్పడింది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పట్టణ పోలీసులు. స్థానికుల సహాయంతో రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చెట్టును తొలగించారు. జోరు వర్షంలోను పోలీసులు చేపట్టిన చర్యలతో తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి.  

ఇక గుంటూరులో ఉదయం ఐదు గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్స్ లేకా రహదారులు వర్షపునీటితో మునిగింది. మునిసిపల్ కమిషనర్ బంగ్లా వద్ద రోడ్డుపైనే మురికినీరు నిలిచిపోయింది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వర్షపునీరు చేరింది. డొంకరోడ్డు, శ్రీనగర్, ఆరండల్ పేట, ఏటి అగ్రహారం చెరువులుగా మారాయి. వాహనాదారులు, ప్రజలు అటువైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

తుఫాను తీరం దాటిన శ్రీకాకుళం జిల్లాతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వుందని... మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరిస్తున్నారు. 

click me!