అసని ఎఫెక్ట్: 37 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. విమాన సర్వీసులపై కూడా ప్రభావం..

Published : May 11, 2022, 10:46 AM IST
అసని ఎఫెక్ట్: 37 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. విమాన సర్వీసులపై కూడా ప్రభావం..

సారాంశం

అసని తుఫార్ ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుఫాన్ దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది.   

Trains Cancelled: అసని తుఫాన్ ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుఫాన్ దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తంగా నేడు 37 రైళ్లను రద్దు చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. షెడ్యూల్ మార్పులకు అనుగుణంగా తమ ప్రయాణాలను సిద్ధం చేసుకోవాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది

ఇక, నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (12787)ని షెడ్యూల్‌ని మార్చారు. నర్సాపూర్ నుంచి బుధవారం 11.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరనున్నట్టుగా పేర్కొంది. బిలాస్‌పూర్- తిరుపతి (17481), కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు (17644) రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారిమళ్లించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. 

ఇక, రద్దు చేసిన వాటిలో.. విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్‌, నర్సాపూర్‌-విజయవాడ, నర్సాపూర్‌-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్‌, భీమవరం జంక్షన్‌-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్‌ రైలు సర్వీసులు ఉన్నాయి. 

 

మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. నేడు విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను  రద్దు చేశారు. మొత్తం 22 సర్వీసుల రాకపోకలను రద్దు చేసినట్టుగా ఇండిగో సంస్థ ప్రకటించింది. స్పైస్ జెట్ కూడా ఉదయం సమయంలో సర్వీసులను రద్దు చేసింది. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సర్వీసుపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.  మరోవైపు గన్నవరం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

బలహీనపడిన అసని..
అసని తుపాను బలహీనపడింది. అసని.. తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. దిశ మార్చుకుని ఈశాన్యం వైపునకు కదులుతున్నట్టుగా తెలిపింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తుపాన్ తీరానికి సమీపానికి వస్తున్న కొద్ది గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 

అసని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ, కోనసీమ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముంద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. ఇక, తుఫాన్ నేపథ్యంలో అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుఫాన్ సాయం కోసం 24 గంటల్లో ఎప్పుడైనా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్