
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందజేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను (Arjitha Seva tickets) నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ టికెట్లను రెండేళ్ల తర్వాత ఇప్పుడే విడుదల చేశారు. టీటీడీ ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి సేవలకు భక్తులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్, మే, జూన్ లకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో సేవా టికెట్లు కొనుగోలు చేయ్యాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈరోజు ఉదయం టికెట్లు విడుదల చేసినప్పటికీ సర్వర్‌లో సాంకేతిక లోపం వల్ల టికెట్లు బుక్ కావడం లేదు. లక్కీ డీప్ రిజిస్ట్రేషన్‌కు సైట్ తెరుచుకోకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు.
ఇక, శ్రీవారి భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ ఇది వరకే తెలియజేసిన సంగతి తెలిసిందే. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలకు నేటి ఉదయం 10 గంటల నుంచి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22న ఉదయం 10 గంటల తరువాత టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు వాటి ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణో త్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు.
ఇక, పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా.. తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.