ఏబీ వెంకటేశ్వరరావుని వేధించాలనే దురుద్దేశంతోనే క్రిమినల్ కేసు.. న్యాయవాది బి ఆదినారాయణరావు

By Bukka SumabalaFirst Published Sep 9, 2022, 10:18 AM IST
Highlights

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని వేధించాలనే దురుద్దేశంతోనే క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో తెలిపారు. 

అమరావతి : ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని వేధించాలనే దురుద్దేశంతోనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారని సీనియర్ న్యాయవాది బీ ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ ను వేధింపులకు గురిచేసేందుకు అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం వేధిస్తుందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏడాదిన్నర గడిచినా దర్యాప్తు పూర్తి చేయలేదని ఫిర్యాదు చేశారు. ఆయన పదవీ విరమణ చేసేంతవరకు దర్యాప్తును సాగదీయాలనే దురాలోచనలోనే ఉన్నారని తెలిపారు. దీంతో ఏబీ తరఫున వాదనలు ముగిశాయి. 

ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినేందుకు విచారణను జస్టిస్ ఎన్. జయసూర్య ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. భద్రత - నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ నిఘా విభాగాధిపతి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా సీనియర్ న్యాయవాది బి  ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నిఘా పరికరాల కొనుగోలులో పిటిషనర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఒకసారి సస్పెండ్ చేయగా ఆ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది అన్నారు.

‘మా ఇంటికి రా… స్నానం చేయిస్తా! ఓ కిస్ ఇస్తావా.. !’...పంచాయతీ మహిళా కార్యదర్శితో ఎంపీడీవో అసభ్య ప్రవర్తన..

సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది అని తెలిపారు. అదే కారణం చూపి పిటిషనర్ ను మరోసారి సస్పెండ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. నిఘా పరికరాల కొనుగోలులో పిటిషనర్కు ఎలాంటి పాత్ర లేదన్నారు. పరికరాల కొనుగోలు ప్రక్రియను అప్పటి డీజీపీ ప్రారంభించారని తెలిపారు. ‘కాంపిటెంట్ అథారిటీ హోదాలో అప్పటి డిజిపి సాంకేతిక, కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేశారు. డీజీపీ కోరడంతో కమిటీల్లో సభ్యులుగా సీనియర్ అధికారుల పేర్లను పిటిషనర్ సూచించారు.  

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (ఎస్ టీసీఐఎల్) నిఘా పరికరాల కొనుగోలు టెండర్ ప్రక్రియను అప్పగించారు. ఆ తరువాత కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని డీజీపీ ఆ టెండర్ ను రద్దు చేశారు. కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో సేవలు అందించినందుకు గాను ఎస్ టీసీఐఎల్ రూ.10లక్షలు మినహాయించింది. ఆ సొమ్మును కూడా  ఆ తరువాత వెనక్కి ఇచ్చేసింది. ఆ విషయం ఏసీబీ తన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగకుండా, అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదు.

హోదాను అడ్డం పెట్టుకుని కమిటీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పిటిషనర్ కన్నా ఉన్నత హోదాలో ఉన్న అధికారులను ప్రభావితం చేయడం ఎలా సాధ్యం?  పిటిషనర్ కుమారుడి సంస్థ ‘ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్’..  టెండరు పొందిన ఇజ్రాయెల్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని ఏసీబీ ఆరోపిస్తోంది. అయితే, ఏపీ, తెలంగాణలో తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థలూ లేవని ఇజ్రాయెల్ సంస్థ స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేసును కొట్టేయండి’  అని అభ్యర్థించారు. 

click me!